
భారత బౌలర్ల జోరు
సిరీస్‌లో తమ ఆశలు నిలుపుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్ లోనూ వెస్టిండీస్ ఆటలో ఎలాంటి మార్పు
►వెస్టిండీస్ 189/9
►పాండ్యా, ఉమేశ్‌లకు చెరో 3 వికెట్లు
►భారత్‌తో నాలుగో వన్డే
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): సిరీస్‌లో తమ ఆశలు నిలుపుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్ లోనూ వెస్టిండీస్ ఆటలో ఎలాంటి మార్పు కనిపించలేదు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ విలవిలలాడడంతో ఓ మాదిరి స్కోరు కూడా చేయలేకపోయింది. ఆదివారం సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (60 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ హోప్ (63 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా, కుల్దీప్‌కు 2 వికెట్లు దక్కాయి. యువరాజ్, అశ్విన్ స్థానాల్లో దినేశ్ కార్తీక్, జడేజాతో పాటు భువనేశ్వర్ స్థానంలో రెండేళ్ల అనంతరం పేసర్ షమీ తొలిసారి వన్డే బరిలోకి దిగాడు.
అదే తీరు...
టాస్ గెలిచిన విండీస్ ఈసారి సిరీస్‌లో తొలిసారిగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే ఆరంభంలో పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్ కట్టుదిట్టమైన బంతులతో విండీస్‌ను ఇబ్బందిపెట్టారు. వీరిద్దరి ధాటికి తొలి పది ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది. కానీ పరుగులు పెద్దగా చేయకపోయినా క్రీజులో పాతుకుపోయి విసిగించిన విండీస్‌ను 18వ ఓవర్‌లో పాండ్యా దెబ్బతీశాడు. నిదానంగా కుదురుకుంటున్న కైల్ హోప్... జాదవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
జడేజా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మరో ఓపెనర్ లూయిస్‌ను కుల్దీప్ తను వేసిన తొలి ఓవర్‌లోనే అవుట్ చేయడంతో విండీస్ మరో కీలక వికెట్‌ను కోల్పోయింది. కొద్దిసేపటికి ఓ మాదిరిగా ఆడుతున్న చేజ్‌ను కూడా కుల్దీప్ అవుట్ చేయడంతో 121 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో 32 పరుగుల వ్యవధిలోనే షై హోప్ (39 బంతుల్లో 25; 1 ఫోర్), హోల్డర్ (11), పావెల్ (2), మొహమ్మద్ (20) వికెట్లను కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో జట్టు 200 పరుగులు కూడా చేయలేకపోయింది.
భారత్ 53/3
కడపటి వార్తలు అందేసరికి భారత్ 15 ఓవర్లలో 3 వికెట్లకు 53 పరుగులు చేసింది. ధావన్(5), కోహ్లి(3), కార్తీక్(2) విఫలం కాగా, రహానే (36), ధోని (4) క్రీజులో ఉన్నారు.