సొంతగడ్డపై తమకు ఎదురే లేదని భారత్ మరోసారి నిరూపించింది...పుణేలో పరాజయం చాలా అరుదైన సందర్భంగా చూపిస్తూ వరుసగా రెండు ఏకపక్షవిజయాలతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఐదుగురు టీమిండియా బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి వికెట్లు తీయడంతో చేతులెత్తేసిన విండీస్ 104 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని ఆహ్వానించింది. చివరి మ్యాచ్‌లో కొంతైనా పోటీనివ్వగలదని భావించిన ఆ జట్టు తమ టెస్టు ప్రదర్శనను పునరావృతం చేసి మ్యాచ్‌ను అప్పగించేసింది. ఛేదనలో ఎప్పటిలాగే రోహిత్, కోహ్లి తమదైన శైలిలో ఫటాఫట్ షాట్లతో రికార్డు స్థాయిలో మరో 35.1 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. ఎదురులేని ఆటతో సిరీస్‌ను సంతృప్తిగా ముగించిన కోహ్లి సేన వరల్డ్ కప్ దిశగా ఆడబోయే 18 వన్డేల్లో ఐదింటిలో తమ అస్త్రశస్త్రాలను అనుకున్న విధంగా పరీక్షించుకొని విజయవంతంగా తమ లెక్కలు సరి చూసుకుంది.
తిరువనంతపురం: అనూహ్యమేమీ జరగలేదు... ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురు కాకుండా సిరీస్ వచ్చి టీమిండియా ఒళ్లో వాలింది. పటిష్టమైన భారత్ ముందు వెస్టిండీస్ మరోసారి కూనలా మారిపోయింది. ఫలితంగా చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. రెండో వన్డే ‘టై’గా ముగియగా, మూడో మ్యాచ్‌లో విండీస్ నెగ్గింది. మిగతా మూడు వన్డేలలో భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురువారం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (33 బంతుల్లో 25; 2 ఫోర్లు), మార్లోన్ శామ్యూల్స్ (38 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడగా, జట్టులో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (4/34) ముందుండి నడిపించగా, మిగతా నలుగురు బౌలర్లూ కనీసం ఒక మెయిడిన్ ఓవర్ వేస్తూ కనీసం ఒక వికెట్ అయినా తీయడం విశేషం. అనంతరం భారత్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (56 బంతు ల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 33 నాటౌట్; 6 ఫోర్లు) రెండో వికె ట్‌కు 99 పరుగులు జోడించారు. మూడు సెంచరీలు సహా సిరీస్‌లో 453 పరుగులు చేసిన విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 4న కోల్‌కతాలో జరుగుతుంది.
టపటపా...
భారత బౌలింగ్ ధాటికి వెస్టిండీస్‌లో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిలవలేకపోయారు. సిరీస్ ఆరంభంలో చూపించిన పట్టుదలను ఎవరూ ప్రదర్శించకపోవడంతో ఆ జట్టు కుప్పకూలింది. ఇన్నింగ్స్ నాలుగో బంతినుంచే విండీస్ పతనం మొదలైంది. భువీ వేసిన చక్కటి బంతికి కీరన్ పావెల్ (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే షై హోప్ (0)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో శామ్యూల్స్ కొన్ని చక్కటి షాట్లతో ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఖలీల్ ఓవర్లో అతను సిక్స్, ఫోర్ కొట్టాడు. అయితే తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన జడేజా, రెండో ఓవర్లో విండీస్‌ను దెబ్బ తీశాడు. జడేజా బంతిని అంచనా వేయలేక శామ్యూల్స్ కవర్స్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. మరి కొద్దిసేపటికి హెట్‌మైర్ (9)ను కూడా జడ్డూ పెవిలియన్ పంపించగా, ఖలీల్ వేసిన తర్వాతి ఓవర్లోనే రావ్‌మన్ పావెల్ (16) ఔటయ్యాడు. దాంతో 57 పరుగులకు విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరో ఎండ్‌లో హోల్డర్ కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. విండీస్ తమ చివరి ఐదు వికెట్లు 38 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. హోల్డర్‌ను వెనక్కి పంపించిన ఖలీల్ ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించగా, మిగతా వికెట్లు కూలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 32వ ఓవర్లో జడేజా రెండు వికెట్లతో ప్రత్యర్థి ఆట కట్టించాడు. భారత్ మార్పులేమీ లేకుండా ఈ మ్యాచ్‌లో దిగగా... విండీస్ రెండు మార్పులు చేసింది. గాయంతో ఈ మ్యాచ్ ఆడని ఆష్లే నర్స్ టి20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
ఆడుతూ పాడుతూ...
ఛేదనలో భారత జట్టు ఆరంభంలోనే శిఖర్ ధావన్ (6) వికెట్ కోల్పోయింది. థామస్ బంతిని అతను వికెట్లపైకి ఆడుకున్నాడు. థామస్ తర్వాతి ఓవర్లో 4 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హోల్డర్ వదిలేయడం భారత్‌కు కలిసొచ్చింది. అనంతరం థామస్ బౌలింగ్‌లోనే 18 పరుగుల వద్ద రోహిత్...కీపర్‌కు క్యాచ్ ఇచ్చినా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత హోల్డర్ ఓవర్లో రోహిత్ వరుసగా 4, 6 బాదాడు. ఈ సిక్సర్ రోహిత్ కెరీర్‌లో 200వది కావడం విశేషం. జోరు తగ్గించని భారత ఓపెనర్... కీమో పాల్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 45 బంతుల్లో రోహిత్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ అలవోకగా జట్టును గెలిపించారు.
►వెస్టిండీస్‌కు భారత్‌పై ఇదే అత్యల్ప స్కోరు. గతంలో కరీబియన్ జట్టుపోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో 121 పరుగులకు ఆలౌటైంది.
►మిగిలిన బంతులపరంగా చూస్తే భారత్‌కు ఇది రెండో అతి పెద్ద (211) విజయం. గతంలో కెన్యాపై 231 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.
►4000 వన్డేల్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ 4060 పరుగులు జత చేశారు. వీరిద్దరు కేవలం 66 పార్ట్‌నర్‌షిప్‌లలోనే ఈ మైలురాయిని దాటారు. గతంలో రాహుల్ ద్రవిడ్, గంగూలీ కలిసి 80 భాగస్వామ్యాల్లో
4 వేల పరుగులు పూర్తి చేశారు.
►202 వన్డేల్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య. 200కు పైగా సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అఫ్రిది, గేల్, జయసూర్య, ధోని, డివిలియర్స్, బ్రెండన్ మెకల్లమ్ మాత్రమే ఉన్నారు. ఈ ఏడుగురిలో అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ (187)ల్లో రోహిత్ ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో అఫ్రిది 200 సిక్సర్ల కోసం 195 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
►6 సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా ఆరో సిరీస్ విజయం
Comments
Please login to add a commentAdd a comment