పాకిస్థాన్ జట్టు ఫైసలాబాద్ వోల్వ్స్‌ను వీసా చిక్కులు వెంటాడుతున్నాయి. దీంతో ఈ జట్టు సభ్యులను ఉన్నపలంగా చండీగఢ్ నుంచి మొహాలీకి తరలించారు.
చండీగఢ్: పాకిస్థాన్ జట్టు ఫైసలాబాద్ వోల్వ్స్‌ను వీసా చిక్కులు వెంటాడుతున్నాయి. దీంతో ఈ జట్టు సభ్యులను ఉన్నపలంగా చండీగఢ్ నుంచి మొహాలీకి తరలించారు. కారణం భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ వారికింగా పూర్తి స్థాయి వీసా దక్కలేదు. కేవలం మొహాలీకి మాత్రమే పరిమితమయ్యే విధంగా కేంద్రం వీసా మంజూరు చేసింది.
మంగళవారం నుంచి మొదలయ్యే చాంపియన్స్ లీగ్ క్వాలిఫయింగ్ ఈవెంట్ కోసం మిస్బావుల్ హక్ నేతృత్వంలోని వోల్వ్స్ జట్టు శనివారం ఇక్కడికి చేరుకుంది. కానీ చండీగఢ్‌కు ఈ వీసా చెల్లుబాటు కాకపోవడంతో ఆటగాళ్లను బస చేసిన హోటల్ నుంచి మొహాలీలోని పీసీఏ స్టేడియం క్లబ్‌హౌస్‌కు తరలించారు. దీనిపై బీసీసీఐ... విదేశీ వ్యవహారాల శాఖ, హోం శాఖ వర్గాలతో చర్చిస్తోంది. సోమవారం కల్లా వీసా సమస్య తీరుతుందని, తిరిగి చండీగఢ్ హోటల్‌కు వోల్వ్స్‌ను తరలించే అవకాశముందని బోర్డు తెలిపింది. నిజానికి భారత ప్రభుత్వం తొలుత పాక్ జట్టుకు వీసా నిరాకరించింది. ఎట్టకేలకు చివరి నిమిషంలో మంజూరు చేయడంతో భారత్‌కు వచ్చింది.