సాక్షి మెరిసింది దేశం మురిసింది
భారత్‌కు తొలి పతకం అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్
{ఫీస్టయిల్ 58 కేజీల విభాగంలో కాంస్యం
ఈ ఘనత సాధించిన తొలి మహిళా రెజ్లర్
ఇంత పెద్ద దేశం... ఇంత భారీ జనాభా.... అయినా ఒక్క పతకమూ లేదే...? మనసు నిండా వెలితి... 70 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాన్ని జరుపుకుంటున్నా... చిన్న దేశాల ఒడిలో వాలిన పతకాలను చూసి మనకు లేవే..? అంతులేని ఆవేదన...
రోజులు గడిచిపోతున్నాయి... ఇక నాలుగు రోజులే మిగిలాయి... ఈ సారికి పతకం రాదేమో..? అని మానసికంగా సన్నద్ధమవుతున్న వేళ. అయినా సరే ఎవరో ఒకరు ఒక్క పతకమైనా తీసుకు రాకపోతారా అని ఏదో ఓ మూల చిన్న ఆశ? పతకాల పట్టికలో మన దేశం పేరును చేర్చేవాళ్లు ఎవరు..?
గురువారం ఉదయం... పొద్దుటే చెల్లెలు వచ్చి రాఖీ కడుతుందని నిద్ర లేచిన భారతీయుడికి... సోదరి సాక్షి మలిక్ తెచ్చి కట్టిన పతకం చూసి ఆనంద భాష్పాలు వచ్చేసాయి... రియో నుంచి ప్రత్యేకంగా పంపిన మిఠాయి లాంటి వార్తతో నోరు తీపి అయిపోయింది.పదకొండు రోజుల ఆవేదనకు, కోట్లాది భారతీయుల ఎదురుచూపులకు, అంతు లేని నిరీక్షణకు తెరదించుతూ... మన హృదయాల్లో సంబరం నింపుతూ... మువ్వన్నెలు మురిసేలా... భారతదేశం గర్వించేలా సాక్షి దేశం మెడలో పతకహారాన్ని చేర్చింది. థ్యాంక్యూ సిస్టర్...
రియో డి జనీరో: దేశం మొత్తం గాఢనిద్రలో ఉన్న సమయంలో రియో ఒలింపిక్స్ నుంచి తీపి కబురు వచ్చింది. 12 రోజుల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగంలో సాక్షి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో సాక్షి 8-5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. కాంస్య పతక బౌట్‌లో ఒకదశలో 0-5తో వెనుకబడి ఓటమివైపు సాగుతున్న దశలో సాక్షి తన పోరాటపటిమతో అద్భుతమే చేసింది. వెంటవెంటనే 2,2,1 పాయింట్లు సాధించి స్కోరును 5-5తో సమం చేసింది. మరో ఆరు సెకన్లలో బౌట్ ముగుస్తుందనగా... సాక్షిని నిలువరిస్తే బౌట్ ఆరంభంలో ఆధిపత్యం చలాయించినందుకు తనకే అనుకూల ఫలితం వస్తుందని తినిబెకోవా భావించింది. కానీ సాక్షి ఈ ఆరు సెకన్లను ఏమాత్రం వృథా చేయకుండా తినిబెకోవాను కిందకు పడేసి... 8-5తో విజయాన్ని ఖాయం చేసుకొని దేశం మొత్తం సంబరాల్లో మునిగేలా చేసింది.
వెనుకబడి.. విజయాల ఒడిలోకి..
తన విభాగంలో సాక్షి గెలిచిన అన్ని బౌట్‌లలోనూ తొలుత వెనకబడినా గెలిచింది. జోనా మాట్సన్ (స్వీడన్)తో జరిగిన తొలి రౌండ్‌లో సాక్షి మొదట 0-4తో వెనుకంజ వేసి ఆ తర్వాత 5-4తో విజయాన్ని దక్కించుకుంది. మరియానా (మాల్డొవా)తో జరిగిన రెండో రౌండ్‌లో తొలుత 1-3తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 5-5తో స్కోరును సమం చేసింది. అయితే బౌట్‌లో ఆధిపత్యం చలాయించినందుకు సాక్షిని విజేతగా ప్రకటించారు. ఒర్ఖాన్ ప్యూర్‌విడోర్డ్ (మంగోలియా)తో జరిగిన రెప్‌చేజ్ తొలి రౌండ్ బౌట్‌లో సాక్షి 2-3తో వెనుకబడి ఆ తర్వాత వరుసగా 11 పాయింట్లు సాధించింది.
అదృష్టంతోపాటు పోరాటం
సాక్షికి పతకం రావడం వెనుక కాస్త అదృష్టంతోపాటు ఆమె పోరాటం కూడా ఉంది. రెండు గ్రూప్‌ల నుంచి ఫైనల్‌కు వచ్చిన వారి చేతుల్లో ఓడిపోయిన వారందరికీ ‘రెప్‌చేజ్’ నిబంధన ప్రకారం మరో అవకాశం ఇస్తారు. రెప్‌చేజ్ రౌండ్ విజేత సెమీఫైనల్లో ఓడిన వారితో కాంస్యం కోసం ఆడతారు. క్వార్టర్ ఫైనల్లో వలేరియా (రష్యా) చేతిలో సాక్షి ఓడిపోయింది. వలేరియా ఫైనల్‌కు చేరడంతో సాక్షికి ‘రెప్‌చేజ్’ అవకాశం లభించింది. అంతకుముందు వలేరియా చేతిలో తొలి రౌండ్‌లో ఓడిన లుసా హెల్గా (జర్మనీ), రెండో రౌండ్‌లో ఓడిన ఒర్ఖాన్ రెప్‌చేజ్ తొలి రౌండ్‌లో పరస్పరం తలపడ్డారు. ఈ బౌట్‌లో నెగ్గిన ఒర్ఖాన్ రెండో రౌండ్‌లో సాక్షితో ఆడింది. ఒర్ఖాన్‌పై గెలిచిన సాక్షి... వలేరియా చేతిలో సెమీఫైనల్లో ఓడిన తినిబెకోవాతో కాంస్యం కోసం తలపడింది.
రెప్‌చేజ్‌లో సాక్షి ప్రత్యర్థిగా ఉన్న ఒర్ఖాన్ పేరున్న రెజ్లరే. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన జపాన్ దిగ్గజం కవోరి ఇచో (జపాన్)పై ఇటీవల జరిగిన ఓ టోర్నీలో ఒర్ఖాన్ 10-0తో గెలిచి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణాలు సాధించింది. ఇచో లాంటి మేటి రెజ్లర్‌ను ఓడించిన ఒర్ఖాన్‌పై సాక్షి గెలవడం నిజంగా ఆమె పోరాటపటిమకు నిదర్శనం. ఇక కాంస్య పతకపోరు ప్రత్యర్థి తినిబెకోవా ప్రస్తుత ఆసియా చాంపియన్ కావడం గమనార్హం. ప్రత్యర్థి ఎంత పేరున్న వారైనా చివరి సెకను వరకు వారిపై విజయం కోసం ప్రయత్నించి సాక్షి అనుకున్న ఫలితం సాధించింది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని సాక్షి నిరూపించింది.