Wrestler sakshi Malik
-
ఒకే జట్టులో సాక్షి, సత్యవర్త్
ప్రొ రెజ్లింగ్ లీగ్–2 ఆటగాళ్ల వేలం జనవరి 2 నుంచి ఆరంభం యోగేశ్వర్ దత్ దూరం బజరంగ్‌కు అత్యధిక మొత్తం న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మలిక్‌తో పాటు తన కాబోయే భర్త సత్యవర్త్ కడియన్ ఇద్దరూ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్లు్యఎల్) రెండో సీజన్ కోసం శుక్రవారం జరిగిన వేలంలో వీరిద్దరిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. సాక్షికి రూ.30 లక్షల ధర పలకగా... సత్యవర్త్‌ను రూ.18 లక్షలకు తీసుకుంది. తొలి సీజన్లో సాక్షి ముంబై జట్టుకు ఆడగా... సత్యవర్త్ ఉత్తర ప్రదేశ్‌కు ఆడాడు. అలాగే భారత్ నుంచి స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అత్యధిక ధర పలికాడు. అతడిని ఢిల్లీ జట్టు రూ.38 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే సందీప్ తోమర్ (హరియాణా, రూ.31 లక్షలు), రీతూ ఫోగట్ (జైపూర్, 36 లక్షలు), గీతా ఫోగట్ (ఉత్తర ప్రదేశ్, రూ.16 లక్షలు)లకు కూడా మంచి ధర పలికింది. అయితే జనవరి 16న వివాహం చేసుకోబోతున్న భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. ఐదు విభిన్న వేదికల్లో జరిగే ఈ లీగ్ వచ్చే నెల 2 నుంచి ప్రారంభమవుతుంది. రియోలో స్వర్ణం సాధించిన వ్లాదిమిర్ ఖించెగష్వి (జార్జియా) అత్యధిక ధర పలికిన రెజ్లర్‌గా నిలిచాడు. తనను టీమ్ పంజాబ్ జట్టు రూ.48 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఆ తర్వాత లండన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మగోమెడ్ కుర్బనలీవ్ (అజర్బైజాన్)ను కూడా పంజాబ్ రూ.47 లక్షలకు తీసుకుంది. 200కు పైగా రెజ్లర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ప్రతీ జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లు (ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఉండగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. -
కండబలంతో కాదు టెక్నిక్‌తో గెలిచా
న్యూఢిల్లీ: క్రీడల్లో ముఖ్యంగా కుస్తీ వంటి పోటీల్లో గెలవాలంటే కండబలం చాలా అవసరం. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ మాత్రం.. తాను కేవలం కండబలంతో గెలవలేదని, బుద్ధిబలం కూడా తోడైందని చెప్పింది. హరియాణాకు చెందిన సాక్షిని ఎయిరిండియా సన్మానించింది. బిజినెస్ క్లాస్‌లో సాక్షి ఉచితంగా ప్రయాణించేందుకు సదుపాయం కల్పించినట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ.. ‘నేను శక్తి వల్ల మాత్రమే గెలవలేదు. టెక్నిక్ కూడా తోడైంది. రియోలో పతకం గెలవడం ఓ మధురానుభూతి. పోటీల కోసం బరువు తగ్గా. డైట్‌పై కంట్రోల్ చేశాను. అన్ని టోర్నమెంట్లకు ఒకేవిధంగా ప్రాక్టీస్ చేస్తాను. అయితే ప్రత్యర్థిని బట్టి దృష్టిసారించాలి. పవర్, వెయిట్, స్పీడ్ ట్రైనింగ్స్‌లో ప్రాక్టీస్ చేయాలి. నా కుటుంబ సభ్యులు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. రియోలో 15 రోజులు ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియదు. నాపై గెలిచిన రష్యా రెజ్లర్ ఫైనల్‌కు చేరుతుందని వందశాతం నమ్మాను. ఏదేమైనా నేను పతకం గెలుస్తానని భావించా’ అని సాక్షి చెప్పింది. -
రెజ్లర్ సాక్షి సీక్రెట్ బయటపడింది
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ దాచిన సీక్రెట్ బయటపడింది. ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలిసిపోయింది. సాక్షికి కాబోయే భర్త పేరును ఆమె సోదరుడు సచిన్ వెల్లడించాడు. ఆ లక్కీ ఫెలో ఎవరంటే.. ఆమె సొంతూరు రోహ్టక్కు చెందిన అంతర్జాతీయ రెజ్లర్ సత్యవర్త్ కడియన్. సత్యవర్త్ అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు కూడా గెలిచాడు. సత్యవర్త్ (22) వయసు సాక్షి (24) కంటే రెండేళ్లు తక్కువ. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సాక్షి బ్రెజిల్ వెళ్లకుముందే వీరి పెళ్లి నిశ్చయమైనట్టు సచిన్ చెప్పాడు. ఒలింపిక్స్ తర్వాత సాక్షి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానో సహచర రెజ్లింగ్ ఆటగాడిని పెళ్లి చేసుకోబోతున్నాని, అయితే తనకు కాబోయే భర్త పేరు మాత్రం సీక్రెట్ అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. సత్యవర్త్ రెజ్లర్ల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి సత్యవన్ పేరున్న రెజ్లర్. రోహ్టక్లో ఓ అకాడమీని నడుపుతున్నాడు. సాక్షి, సత్యవర్త్ వివాహం చేసుకుంటారని సత్యవన్ కూడా ధ్రువీకరించాడు. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచాక సాక్షి పేరు దేశమంతా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ముగిశాక ఓ బెంగాలీ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాక్షి.. తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన సన్నాహాలకు పెళ్లి ఏమాత్రం అడ్డు కాబోదని చెప్పింది. 'అతను నా సన్నాహాలకు సహాయంగా నిలుస్తాడు. పెళ్లి తర్వాత రెజ్లింగ్ క్రీడను కొనసాగించడం ఏమీ సమస్య కాబోదని నేను అనుకుంటున్నా' అని తెలిపింది. -
రెజ్లర్ సాక్షి రాక నేడే...
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ నేడు (బుధవారం) భారత్‌కు రానుంది. తెల్లవారుజాము 3.50 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అడుగుపెట్టనున్న సాక్షికి హర్యానా రాష్ట్ర ఐదుగురు మంత్రులు స్వాగతం పలకనున్నారు. ‘నా దేశానికి, నా స్వంత ఇంటికి రాబోతున్నాను’ అని సాక్షి ట్వీట్ చేసింది. రోహ్తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి ఆమెతో పాటు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా వెళ్లనున్నారు. అక్కడ భారీ జనసమూహం మధ్య ఆమెకు సన్మానం చేయనున్నారు. కాంస్యం సాధించిన తనకు రూ.2.5 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
సాక్షి మెరిసింది దేశం మురిసింది
భారత్‌కు తొలి పతకం అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ {ఫీస్టయిల్ 58 కేజీల విభాగంలో కాంస్యం ఈ ఘనత సాధించిన తొలి మహిళా రెజ్లర్ ఇంత పెద్ద దేశం... ఇంత భారీ జనాభా.... అయినా ఒక్క పతకమూ లేదే...? మనసు నిండా వెలితి... 70 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాన్ని జరుపుకుంటున్నా... చిన్న దేశాల ఒడిలో వాలిన పతకాలను చూసి మనకు లేవే..? అంతులేని ఆవేదన... రోజులు గడిచిపోతున్నాయి... ఇక నాలుగు రోజులే మిగిలాయి... ఈ సారికి పతకం రాదేమో..? అని మానసికంగా సన్నద్ధమవుతున్న వేళ. అయినా సరే ఎవరో ఒకరు ఒక్క పతకమైనా తీసుకు రాకపోతారా అని ఏదో ఓ మూల చిన్న ఆశ? పతకాల పట్టికలో మన దేశం పేరును చేర్చేవాళ్లు ఎవరు..? గురువారం ఉదయం... పొద్దుటే చెల్లెలు వచ్చి రాఖీ కడుతుందని నిద్ర లేచిన భారతీయుడికి... సోదరి సాక్షి మలిక్ తెచ్చి కట్టిన పతకం చూసి ఆనంద భాష్పాలు వచ్చేసాయి... రియో నుంచి ప్రత్యేకంగా పంపిన మిఠాయి లాంటి వార్తతో నోరు తీపి అయిపోయింది.పదకొండు రోజుల ఆవేదనకు, కోట్లాది భారతీయుల ఎదురుచూపులకు, అంతు లేని నిరీక్షణకు తెరదించుతూ... మన హృదయాల్లో సంబరం నింపుతూ... మువ్వన్నెలు మురిసేలా... భారతదేశం గర్వించేలా సాక్షి దేశం మెడలో పతకహారాన్ని చేర్చింది. థ్యాంక్యూ సిస్టర్... రియో డి జనీరో: దేశం మొత్తం గాఢనిద్రలో ఉన్న సమయంలో రియో ఒలింపిక్స్ నుంచి తీపి కబురు వచ్చింది. 12 రోజుల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగంలో సాక్షి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో సాక్షి 8-5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. కాంస్య పతక బౌట్లో ఒకదశలో 0-5తో వెనుకబడి ఓటమివైపు సాగుతున్న దశలో సాక్షి తన పోరాటపటిమతో అద్భుతమే చేసింది. వెంటవెంటనే 2,2,1 పాయింట్లు సాధించి స్కోరును 5-5తో సమం చేసింది. మరో ఆరు సెకన్లలో బౌట్ ముగుస్తుందనగా... సాక్షిని నిలువరిస్తే బౌట్ ఆరంభంలో ఆధిపత్యం చలాయించినందుకు తనకే అనుకూల ఫలితం వస్తుందని తినిబెకోవా భావించింది. కానీ సాక్షి ఈ ఆరు సెకన్లను ఏమాత్రం వృథా చేయకుండా తినిబెకోవాను కిందకు పడేసి... 8-5తో విజయాన్ని ఖాయం చేసుకొని దేశం మొత్తం సంబరాల్లో మునిగేలా చేసింది. వెనుకబడి.. విజయాల ఒడిలోకి.. తన విభాగంలో సాక్షి గెలిచిన అన్ని బౌట్లలోనూ తొలుత వెనకబడినా గెలిచింది. జోనా మాట్సన్ (స్వీడన్)తో జరిగిన తొలి రౌండ్లో సాక్షి మొదట 0-4తో వెనుకంజ వేసి ఆ తర్వాత 5-4తో విజయాన్ని దక్కించుకుంది. మరియానా (మాల్డొవా)తో జరిగిన రెండో రౌండ్లో తొలుత 1-3తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 5-5తో స్కోరును సమం చేసింది. అయితే బౌట్లో ఆధిపత్యం చలాయించినందుకు సాక్షిని విజేతగా ప్రకటించారు. ఒర్ఖాన్ ప్యూర్విడోర్డ్ (మంగోలియా)తో జరిగిన రెప్‌చేజ్ తొలి రౌండ్ బౌట్లో సాక్షి 2-3తో వెనుకబడి ఆ తర్వాత వరుసగా 11 పాయింట్లు సాధించింది. అదృష్టంతోపాటు పోరాటం సాక్షికి పతకం రావడం వెనుక కాస్త అదృష్టంతోపాటు ఆమె పోరాటం కూడా ఉంది. రెండు గ్రూప్‌ల నుంచి ఫైనల్‌కు వచ్చిన వారి చేతుల్లో ఓడిపోయిన వారందరికీ ‘రెప్‌చేజ్’ నిబంధన ప్రకారం మరో అవకాశం ఇస్తారు. రెప్‌చేజ్ రౌండ్ విజేత సెమీఫైనల్లో ఓడిన వారితో కాంస్యం కోసం ఆడతారు. క్వార్టర్ ఫైనల్లో వలేరియా (రష్యా) చేతిలో సాక్షి ఓడిపోయింది. వలేరియా ఫైనల్‌కు చేరడంతో సాక్షికి ‘రెప్‌చేజ్’ అవకాశం లభించింది. అంతకుముందు వలేరియా చేతిలో తొలి రౌండ్లో ఓడిన లుసా హెల్గా (జర్మనీ), రెండో రౌండ్లో ఓడిన ఒర్ఖాన్ రెప్‌చేజ్ తొలి రౌండ్లో పరస్పరం తలపడ్డారు. ఈ బౌట్లో నెగ్గిన ఒర్ఖాన్ రెండో రౌండ్లో సాక్షితో ఆడింది. ఒర్ఖాన్పై గెలిచిన సాక్షి... వలేరియా చేతిలో సెమీఫైనల్లో ఓడిన తినిబెకోవాతో కాంస్యం కోసం తలపడింది. రెప్‌చేజ్‌లో సాక్షి ప్రత్యర్థిగా ఉన్న ఒర్ఖాన్ పేరున్న రెజ్లరే. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన జపాన్ దిగ్గజం కవోరి ఇచో (జపాన్)పై ఇటీవల జరిగిన ఓ టోర్నీలో ఒర్ఖాన్ 10-0తో గెలిచి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణాలు సాధించింది. ఇచో లాంటి మేటి రెజ్లర్‌ను ఓడించిన ఒర్ఖాన్పై సాక్షి గెలవడం నిజంగా ఆమె పోరాటపటిమకు నిదర్శనం. ఇక కాంస్య పతకపోరు ప్రత్యర్థి తినిబెకోవా ప్రస్తుత ఆసియా చాంపియన్ కావడం గమనార్హం. ప్రత్యర్థి ఎంత పేరున్న వారైనా చివరి సెకను వరకు వారిపై విజయం కోసం ప్రయత్నించి సాక్షి అనుకున్న ఫలితం సాధించింది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని సాక్షి నిరూపించింది.