లండన్ : అద్భుతాలేమీ జరగలేదు. అనుకున్నదే జరిగింది. 1992 ప్రపంచకప్ ఫలితాన్ని పునరావృతం చేయాలనుకున్న పాకిస్తాన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. కనీసం సెమీస్‌కు చేరకుండానే లీగ్ దశలోనే ఇంటిబాటపట్టింది. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించి అల్ప సంతోషంతోనే ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 94 పరుగుల తేడాతో పాక్ జయభేరి మోగించింది. పాక్ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఆటగాళ్లలో సీనియర్ ఆటగాడు షకీబుల్ (64; 77 బంతుల్లో 6ఫోర్లు) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బంగ్లా పతనాన్ని శాసించిన షాహిన్ ఆఫ్రిది (6/35)కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
అంతకుముందు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(100: 100 బంతుల్లో 7ఫోర్లు) సెంచరీకి తోడు బాబర్ అజామ్ (96: 98 బంతుల్లో 11ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు చేసింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్(5/75) టోర్నీలో వరుసగా రెండోసారి ఐదు వికెట్లతో చెలరేగాడు.
అదరగొట్టిన ఇమామ్–బాబర్ జోడీ..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫకార్ జమాన్(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ దశలో ఇమామ్–బాబర్ జోడీ రెండో వికెట్‌కు 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఒక దశలో జట్టు స్కోరు 350 దాటుతుందని అనిపించినా మిడిలార్డర్ వైఫల్యం పాక్‌ను దెబ్బతీసింది. తొలుత సెంచరీకి చేరువగా వచ్చిన బాబర్.. సైఫుద్దీన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే సెంచరీ పూర్తిచేసుకున్న ఇమామ్ ఆ వెంటనే హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
దీంతో పాక్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. హఫీజ్(27), హారిస్ సొహైల్(6), రియాజ్(2), షాదాబ్(1), ఆమిర్(8) వెంట వెంటనే ఔటయ్యారు. ఆఖర్లో ఇమాద్ వసీం(43: 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో పాక్ స్కోరు 300 దాటింది. సర్ఫరాజ్(3), షహీన్ అఫ్రిది(0) అజేయంగా నిలిచారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్ 3, మెహిదీ హసన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment