వరల్డ్ కప్ పైనే.. ర్యాంకింగ్స్ పై కాదు!
మెల్ బోర్న్:వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ ర్యాంక్ లో కొనసాగుతున్నా.. ఆ ర్యాంకింగ్స్ కు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తమ లక్ష్యం వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడంపైనే ఉందని, ర్యాంకులపై కాదన్నాడు. త్వరలో జరగబోయే వరల్డ్ కప్ ను గెలిస్తే అది అన్నింటికీ పరిష్కారం చూపుతుందన్నాడు.'వన్డే ర్యాంకింగ్ లో ఆస్ట్రేలియా తరువాత దక్షిణాఫ్రికా, టీమిండియాలు ఉన్నాయి. వచ్చే వారం దక్షిణాఫ్రికా-జింబాబ్వేల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నా.. వరల్డ్ కప్ ను కూడా గెలిచి నిరూపించుకోవాలన్నాడు.
ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్క వరల్డ్ కప్ ను గెలుచుకోలేదన్న విషయాన్ని క్లార్క్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆస్టేలియా-న్యూజిలాండ్ లు సంయుక్తంగా నిర్వహించే వరల్డ్ కప్ పైనే దృష్టి సారించమన్నాడు. మరో ఆరు నెలల్లో ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుందని.. అప్పుడే నంబర్ వన్ ఎవరో తెలుస్తుందని క్లార్క్ తెలిపాడు.