పెర్త్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్టేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ గాయపడ్డాడు. గత కొన్ని నెలలుగా గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న క్లార్క్ మరోసారి గాయపడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం దక్షిణాఫ్రికా-ఆసీస్ ల మధ్య అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్లార్క్ ఎడమ తొడకండరాలు పట్టేసినట్లు క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
దీంతో క్లార్క్ మిగతా మ్యాచ్ ల్లో పాల్గొనేది అనుమానంగా మారింది. శనివారం నాటి స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తరువాత గానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్ పీటర్ బ్రుక్నర్ తెలిపాడు. నేటి మ్యాచ్ లో క్లార్క్ 20 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది.