సాక్షి, బజరంగ్‌లపై దృష్టి
నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
పారిస్: పతకమే లక్ష్యంగా సోమవారం మొదలయ్యే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు.పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో కలిపి భారత్ తరఫున మొత్తం 24 మంది ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన సాక్షి మలిక్ ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గురువారం 60 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
సాక్షితోపాటు వినేశ్ ఫోగట్ (48 కేజీలు)పై భారత బృందం ఆశలు పెట్టుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ (57 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), సత్యవర్త్ కడియన్ (97 కేజీలు) పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన బజరంగ్ 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 60 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం సాధించాడు. తొలి రోజు సోమవారం గ్రీకో రోమన్ విభాగంలో (71 కేజీలు, 75 కేజీలు, 85 కేజీలు, 98 కేజీలు) పోటీలు జరుగుతాయి.
రాత్రి గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం