ఓడిపోతే రూ.3 కోట్లు! | Wrestler Sushil Kumar says he was offered money to lose championship | Sakshi
Sakshi News home page

ఓడిపోతే రూ.3 కోట్లు!

Published Sat, Aug 24 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

ఓడిపోతే రూ.3 కోట్లు!

ఓడిపోతే రూ.3 కోట్లు!

న్యూఢిల్లీ: ఫిక్సింగ్.. సామాన్యంగా ఈ జాడ్యం ఎక్కువగా క్రికెట్‌లోనే కనిపిస్తుంటుంది. అయితే కాదేదీ ఫిక్సింగ్‌కు అనర్హం అన్నట్టుగా ఇది ప్రపంచ క్రీడలన్నింటికీ పాకింది. తాజాగా ప్రఖ్యాత రెజ్లర్ సుశీల్ కుమార్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టాడు. 2010 మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనకెదురైన ఫిక్సింగ్ అనుభవాన్ని వెల్లడించాడు. 66కేజీ ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్‌లో రష్యా రెజ్లర్ అలన్ గొగేవ్ చేతిలో ఓడితే రూ.3 కోట్ల భారీ మొత్తం ముడుతుందని కొంత మంది ఆఫర్ చేసినట్టు సుశీల్ చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అప్పుడే అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు.
 
 
 ‘మా జట్టు విదేశీ కోచ్‌ల్లో ఒకరి ద్వారా ఈ ప్రతిపాదనను నా దగ్గరికి తెచ్చారు. ఫైనల్ బౌట్ ఓడితే రూ.3 కోట్లు ఇస్తామన్నారు. ఓ రెజ్లర్‌కు నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. రష్యాలో రెజ్లింగ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వారు ఓ భారత ఆటగాడు ఫైనల్‌కు వస్తాడని ఊహించలేకపోయారు. వారి సొంత దేశంలో పోటీలు కాబట్టి అక్కడి వారే గెలవాలని వారు భావించారు. కానీ 3-1తో తనను ఓడించాను. డబ్బు విషయం ఇక్కడ ముఖ్యం కాదు.
 
 
 దేశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బౌట్ గెలిచాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు. నాలుగైదు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నా మాస్కోలో నాకు లభించిన ఆదరణ అపూర్వం. అయితే ఈ ఫిక్సింగ్ గురించి 2010లోనే అధికారులకు సమాచారమిచ్చాను. కానీ ఎవరూ స్పందించలేదు’ అని ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సుశీల్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సర్లకు అత్యంత కఠిన శిక్షలు పడాలని ఆశించాడు. అలాగే అవినీతి అధికారులను రెజ్లింగ్ నుంచి తొలగించాలని కోరాడు.
 
 రెజ్లింగ్‌లో మామూలే: అధికారులు
 రెజ్లర్ సుశీల్ కుమార్ చెప్పిన ఫిక్సింగ్ అంశాన్ని భారత అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అసలు సుశీల్ అప్పట్లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేయలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ రాజ్ సింగ్ చెప్పారు. అలాగే ఈ అంశంపై తానేమీ ఆశ్చర్యపోలేదని అన్నారు. ‘ఇలాంటివి గతంలోనే నేను విన్నాను. వీటిపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
 
 ‘ఫిక్సింగ్‌కు సచిన్ దూరంగా ఉండమన్నాడు’
 మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహా ఇచ్చాడని రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ చెప్పాడు. ‘సచిన్‌తో కలిసి కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఒకసారి మేం ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో కలుసుకున్నాం.
 
  కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఫిక్సింగ్ గురించి మాట్లాడారు. ‘నీవు కనుక మరో పతకం గెలవాలని అనుకుంటే మాత్రం అలాంటి వారు చేస్తున్న పనులను మాత్రం చేయకు’ అని అక్కడే ఉన్న కొంత మందిని చూపిస్తూ సచిన్ అన్నాడు. ఎవరా అని నేను తలెత్తి వారి వైపు చూశాను. తన తోటి క్రికెటర్లను చూపిస్తూ సచిన్ అలా చెప్పాడు. వారి పేర్లు నేను చెప్పను. మీరే ఓ నిర్ధారణకు రండి’ అని సుశీల్ పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement