సాక్షి, హైదరాబాద్: మల్క కొమరయ్య (ఎంకే) ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య డీపీఎస్ అండర్-13, 15 జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. అండర్-15 క్వార్టర్ ఫైనల్లో యశవి (25 బంతుల్లో 57) ధాటిగా ఆడటంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్-నాచారం) 33 పరుగుల తేడాతో సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్‌పై గెలుపొందింది.
మొదట డీపీఎస్ 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. విపిన్ 26 పరుగులు చేశాడు. తర్వాత సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ 6 వికెట్లకు 94 పరుగులే చేయగల్గింది. డీపీఎస్ బౌలర్ సూర్య 2 వికెట్లు తీశాడు. అండర్-13 క్వార్టర్స్‌లో డీపీఎస్ 19 పరుగుల తేడాతో గ్లోబల్ ఇండియన్ స్కూల్‌పై గెలిచింది. తొలుత డీపీఎస్ 3 వికెట్లకు 118 పరుగులు చేసింది. అమృత్ (32 బంతుల్లో 51) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లోబల్ స్కూల్ 4 వికెట్లకు 99 పరుగులే చేయగల్గింది. విష్ణు 21 బంతుల్లో 32 పరుగులు చేశాడు.