తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ. రెండో రోజు ఆడింది 64 ఓవర్లే. దీనికి తోడు పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
శ్రీలంకపై 10 వికెట్లతో గెలుపు
యాసిర్ షాకు ఏడు వికెట్లు
గురువారం నుంచి రెండో టెస్టు
గాలే: తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ. రెండో రోజు ఆడింది 64 ఓవర్లే. దీనికి తోడు పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే ‘డ్రా’ ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌ను మిస్బా ఉల్ హక్ బృందం సంచలన ఆటతీరుతో దక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తించిన లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (7/76) కెరీర్‌లో ఉత్తమ గణాంకాలను నమోదు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయం అందేలా చేశాడు. ఫలితంగా పాక్ 10 వికెట్ల తేడాతో తొలి టెస్టులో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య కొలంబోలో రెండో టెస్టు జరుగుతుంది.
ఆట చివరిరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 63/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 77.1 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కరుణరత్నే (173 బంతుల్లో 79; 10 ఫోర్లు), తిరిమన్నే (95 బంతుల్లో 44; 4 ఫోర్లు), చండిమాల్ (73 బంతుల్లో 38; 4 ఫోర్లు) మినహా మిగతా ఆటగాళ్లంతా యాసిర్ షా లెగ్ స్పిన్‌కు బెంబేలెత్తారు. అతడి ధాటికి చివరి 5 వికెట్లను శ్రీలంక 39 పరుగుల తేడాలో కోల్పోయింది. అనంతరం 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఓపెనర్లు హఫీజ్ (33 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు; 1 సిక్స్), షెహజాద్ (35 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు) వేగంగా ఆడడంతో 11.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసి నెగ్గింది.
2006 అనంతరం శ్రీలంకలో పాక్ టెస్టు గెలవడం ఇదే తొలిసారి యాసిర్ షా (7/76) రూపంలో గత 20 ఏళ్లల్లో పాక్ తరఫున లెగ్ స్పిన్నర్ అత్యుత్తమ ప్రదర్శన ఇది.ఠ ఈ గెలుపుతో పాకిస్తాన్ అత్యధిక టెస్టు విజయాలు (123) సాధించిన ఆసియా జట్టుగా నిలిచింది. 122 టెస్టు విజయాలతో ఇప్పటివరకు టాప్ స్థానంలో ఉన్న భారత్ రెండో స్థానానికి పడిపోయింది.