టాప్ ర్యాంక్‌పై సైనా గురి
నేటి నుంచి ఇండియా ఓపెన్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ దక్కించుకోవాలనే రెండు లక్ష్యాలతో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది. మంగళవారం మొదలయ్యే ఈ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా ఫైనల్‌కు చేరితే తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.
సైనాతోపాటు ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)కు కూడా ఈ టోర్నీ ద్వారా టాప్ ర్యాంక్‌ను అందుకునే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే చెరో పార్శ్వం నుంచి సైనా, కరోలినా ఫైనల్‌కు చేరుకోవచ్చు. తొలి రౌండ్‌లో సైనా క్వాలిఫయర్‌తో; కరోలినా భారత్‌కు చెందిన నేహా పండిత్‌తో ఆడతారు.
సైనాతోపాటు మహిళల విభాగంలో భారత్ తరఫున తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని, సయాలీ గోఖలే, రియా పిళ్లై, పి.సి.తులసీ, శ్రుతి ముందాడ, శైలి రాణే, ముద్ర ధైన్‌జి, తన్వీ లాడ్ పాల్గొంటున్నారు. ఇండియా ఓపెన్‌లో ఆడిన నాలుగు పర్యాయాల్లోనూ సైనా ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ విజేత కిడాంబి శ్రీకాంత్‌తోపాటు పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్, ఆనంద్ పవార్ బరిలో ఉన్నారు.