సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్–12లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు సత్తా చాటారు. 21 సంవత్సరాలు, అంత కన్నా తక్కువ వయసున్న నలుగురు ఆటగాళ్లు మ్యాచ్‌లో కీలక ప్రదర్శన చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. డీసీ విజయం సాధించడంలో ఇద్దరు యువ ఆటగాళ్లు పృథ్వీ షా, రిషబ్ పంత్ కీలక భూమిక పోషించారు. ఆరంభంలో పృథ్వీ షా అర్ధసెంచరీతో అదరగొట్టగా, చివరల్లో పంత్ మెరుపులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్‌లో 21 ఏళ్ల విండీస్ టీనేజర్ కీమో పాల్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మేడిన్ ఓవర్ కూడా ఉండటం విశేషం. ఈ నలుగురిలో అందరి కంటే చిన్నవాడైన పృథ్వీ షా(19) ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడి 348 పరుగులు సాధించాడు. పంత్(21) 15 మ్యాచ్‌ల్లో 450 పరుగులు చేశాడు. కీమో పాల్ 7 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు దక్కించుకున్నాడు. 20 ఏళ్ల వయసున్న రషీద్ ఖాన్ 15 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు నేలకూల్చాడు. ఈ నలుగురిలో ఎవరు స్టార్ ఫెర్‌ఫార్మర్ అంటూ ఐసీసీ కూడా ట్వీట్ చేసింది. (చదవండి: సన్‌పోరు సమాప్తం)
Comments
Please login to add a commentAdd a comment