క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో సీనియర్
కరాచీ:పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. త్వరలో వెస్టిండీస్ తో జరిగే సిరీస్ అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు యూనిస్ తెలిపాడు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో తన రిటైర్మెంట్ పై 40 ఏళ్ల యూనిస్ స్పష్టతనిచ్చాడు. పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న రోజు వ్యవధిలోనే యూనిస్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత పాక్ జట్టులో యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్లే సీనియర్ క్రికెటర్లు.
యూనిస్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని పాక్ సీనియర్ క్రికెటర్ వసీం అక్రమ్ స్వాగతించాడు. 'యూనిస్ ఎప్పుడూ కష్టించే తత్వం ఉన్న క్రికెటర్. క్రికెట్ లో ప్రతీ విషయంలో యూనిస్ చాలా చురుకుగా ఉండేవాడు. జట్టుకు సేవలందించడంలో ఎప్పుడూ ముందుండే ఆటగాడు యూనిస్. అతనంటే నాకు చాలా గౌరవం' అని అక్రమ్ పేర్కొన్నాడు.
యూనిస్ తన టెస్టు కెరీర్ లో 115 మ్యాచ్లాడి 9,977 పరుగులు చేశాడు. అయితే పది వేల టెస్టు పరుగుల్ని పూర్తి చేసుకునేందుకు యూనిస్ కొద్ది దూరంలో ఉన్నాడు. ఒకవేళ విండీస్ తో టూర్ లో 23 పరుగులు చేస్తే పది వేల పరుగుల్ని పూర్తి చేసిన తొలి పాకిస్తాన్ టెస్టు ఆటగాడిగా యూనిస్ గుర్తింపు పొందుతాడు.
ఇటీవల యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన యూనిస్ ఖాన్.. పదకొండు దేశాల్లో శతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. టెస్టు హోదా లేని యూఏఈపై సెంచరీ చేసిన ఘనత కూడా యూనిస్ దే. అంతకుముందు 10 టెస్టు హోదా కల్గిన దేశాల్లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే సెంచరీలు సాధించాడు.