పాక్ క్రికెటర్ అరుదైన ఘనత
జమైకా: పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్ గా ఖ్యాతికెక్కాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో అతడు ఈ రికార్డు లిఖించాడు. 208 ఇన్నింగ్స్ తో ఈ ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్ లో 10 వేల పరుగులు పూర్తి చేసిన 13వ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆరో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీనికి ఒకరోజు ముందే రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. వెస్టిండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పబోతున్నట్టు తెలిపారు. కెప్టెన్ మిస్సా-వుల్-హక్ కూడా ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్నట్టు ప్రకటించాడు.
39 ఏళ్ల యూనిస్ ఖాన్ ఐసీసీ ఆతిథ్యం ఇచ్చిన 11 దేశాల్లోనూ శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతడే. అంతకుముందు జావేద్ మియందాద్ (8832) పేరిట ఉన్న ఈ రికార్డును 2015లో యూనిస్ ఖాన్ కైవసం చేసుకున్నాడు. టెస్టులు, వన్డేలు కలిపి 17284 పరుగులు సాధించాడు. వన్డేల్లో యూనిస్ ఖాతాలో 7249 పరుగులు ఉన్నాయి. పాకిస్తాన్ తరపున వన్డేల్లో ఇంజమాముల్ హక్(11739) అత్యధిక పరుగులు సాధించాడు.
అత్యధిక టెస్టు పరుగుల వీరులు వీరే
1. సచిన్ టెండూల్కర్(15921)
2. రికీ పాంటింగ్(13378)
3. జాక్వెస్ కలిస్ (13289)
4. రాహుల్ ద్రవిడ్(13288)
5. కుమార సంగక్కర(12400)
6. బ్రియన్ లారా(11953)
7. చంద్రర్‌పాల్(11867)
8. మహేల జయవర్ధనే(11814)
9. అలెన్ బోర్డర్(11174)
10. అలిస్టర్ కుక్(11057)
11. స్టీవ్ వా(10927)
12. సునీల్ గవాస్కర్(10122)
13. యూనిస్ ఖాన్(10035)