
హాజల్ కీచ్ తో యువీ నిశ్చితార్థం!
ముంబై: టీమిండియా వన్డే వరల్డ్ కప్ హీరో, ప్లే బాయ్ యువరాజ్ సింగ్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యువరాజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడన్నవార్తలకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. దీపావళి రోజున యువీ వివాహ శుభవార్త చెబుతాడని అభిమానులు ఎదురు చూపులు నిజం కాబోతున్నాయి.
గత కొంతకాలంగా బ్రిటీష్ నటి హాజల్ కీచ్ తో ప్రేమాయణ సాగిస్తున్నయువీ.. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. వీరద్దిరి నిశ్చితార్థం బాలిలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హజల్ ఓ ఉంగరంతో దర్శనమివ్వడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఇటీవల హర్భజన్ సింగ్‌తో జరిపిన ట్వీట్స్ ద్వారా తన పెళ్లిపై ఊహాగానాలకు తెర తీశాడు యువీ. ముందుగా తను భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఇక ఇప్పుడు ఎలాంటి దూస్రాలు వేయకు మిత్రమా.. లైన్‌కు కట్టుబడి ఉండు’ అని సరదాగా ట్వీట్ చేశాడు.
దీనికి వెంటనే స్పందించిన భజ్జీ ‘నీవు కూడా లైన్‌లోకి రా.. ‘స్ట్రెయిట్’గా ఆడు.. పుల్, కట్ ఆడకు’ అని నర్మగర్భంగా స్పందించాడు. యువీ కూడా వెంటనే సమాధానమిస్తూ.. ‘యెస్.. మిస్టర్ హర్భజన్.. దీపావళి నుంచి నేరుగానే ఆడబోతున్నాను’ అని ముగించాడు. దీంతో యువరాజ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు అప్పుడే వార్తలు చోటు చేసుకున్నాయి. ఇక దీపావళి పండుగ వెళ్లిపోవడం.. వారి ఫోటోలు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.