యువరాజ్ సింగ్.. క్రికెట్ స్కిల్స్‌కే కాదు ప్రేమ కథలకూ ఫేమస్సే! ఆ కథల్లోని ఓ నాయికే హాజెల్ కీష్. బ్రిటిష్ మోడల్.. బాలీవుడ్ యాక్ట్రెస్! సినిమా స్టోరీకి తక్కువకాని ఫక్కీలో లవ్ మొదలైంది.. పెళ్లితో శుభమస్తు పలికింది!
హాజెల్.. యువరాజ్‌కి పరిచయమయ్యేనాటికే ‘బాడీగార్డ్’ సినిమాతో పాపులర్ అయింది. ఉమ్మడి మిత్రుడి బర్త్‌డే పార్టీలో కలుసుకున్నారు ఈ ఇద్దరూ. చెరగని చిరునవ్వుతో.. అందరితో సరదాగా మాట్లాడుతున్న హాజెల్.. యువరాజ్‌ను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె నవ్వు. ఫిదా అయిపోయాడు. తనతో మాట కలుపుదామని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆమె అతణ్ణి పట్టించుకోలేదు. పార్టీ అయిపోయి వీడ్కోలు తీసుకుంటున్న సమయానికి యువరాజ్‌ను గమనించింది.
ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆమెను పలకరించాడు. నవ్వింది. మనసంతా నింపుకున్నాడు. ‘బాడీగార్డ్’లో బాచేశావ్’ ప్రశంసించాడు. మళ్లీ నవ్వింది.. ఆ కితాబును స్వీకరిస్తున్నట్టుగా. అంతే యువరాజ్ గాల్లో తేలిపోయాడు. చాలా సందర్భాలను ఉపయోగించుకొని ఆమెతో స్నేహాన్ని కొనసాగించాలని విఫలయత్నం చేశాడు. ఓ ఏడెనిమిదిసార్లు ‘కాఫీ డేట్’కి రమ్మని విన్నవించుకున్నాడు కూడా.
ప్చ్.. పెద్దగా ఆసక్తి కనబర్చలేదు హాజెల్. యువరాజ్ డేట్ మాటెత్తినప్పుడల్లా మాట మార్చేసేదట. ‘అన్నిసార్లు అడిగినా మాట దాటవేసే సరికి ఆమె ఇంకెవరితోనైనా ప్రేమలో ఉందేమో అనుకున్నా’ అని చెప్పాడు యువరాజ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇది 2011లో జరిగింది.
అప్పుడే..
యువరాజ్ సింగ్‌కు క్యాన్సర్‌కు అని తేలింది. దాన్ని ఎదుర్కొనేందుకు మానసిక శక్తిని కూడగట్టుకునే పనిలో పడ్డాడు అతను. అలా ఓ మూడేళ్లు గడచిపోయాయి. హాజెల్‌ను మరచిపోలేకపోయాడు యువరాజ్. యథాలాపంగా ఫేస్‌బుక్ చూసుకుంటుంటే తన ఫ్రెండ్, క్రికెటర్, బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో హాజెల్ కనిపించింది. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ముందటిలాగే పట్టించుకోలేదు ఆమె.
ఆశ్చర్యపోయాడు .. సందేహపడ్డాడు కూడా. ఆ అనుమానంతోనే స్నేహితుడికి చెప్పాడు ‘హాజెల్‌ను ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కూడా. ఆ అమ్మాయి పట్ల నీకు ఇంకే ఆలోచన ఉన్నా మానుకో’ అని. ‘ఛ..ఛ.. ఆ అమ్మాయి పట్ల నాకెలాంటి ఆలోచనలూ లేవు. ఆమె నాకో మంచి ఫ్రెండ్..అంతే’ అని బదులిచ్చాడు అంగద్.
ఓ మూడు నెలల తర్వాత..
యువరాజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది హాజెల్. మళ్లీ డేట్‌కి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ఓకే అంది. ఉప్పొంగిపోయాడు. ఆమె అంటే తనకెంత ఇష్టమో చెప్పాడు. నవ్వుతూ విన్నది హాజెల్. ఆ ప్రేమ అలా కొనసాగింది నాలుగేళ్లపాటు. ఒకసారి బాలీ వెళ్లిందీ జంట. అక్కడ ఆ సముద్రతీరంలో హాజెల్‌ను అడిగాడు యువరాజ్ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యం హాజెల్‌కు. నవ్వింది.. ఆమె కళ్లు కూడా నవ్వాయి.. ఆనందం, ఉద్వేగపు తడిని చిప్పిల్లుతూ. అప్పుడు .. అక్కడే.. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు యువరాజ్.
‘తనను పెళ్లికి ప్రపోజ్ చేసేప్పుడు నెర్వస్ ఫీలయ్యా చాలా. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. టీన్స్‌లో అయితే అది సాధ్యమేమో కానీ.. కొంత వయసొచ్చాక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది ఉంటుంది అని నేనైతే అనుకోను’ అంటాడు యువరాజ్ సింగ్. హాజెల్ కోసం నిశ్చితార్థపు ఉంగరాన్ని ఎంపిక చేయడానికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చించారట యువరాజ్ సింగ్, వాళ్లమ్మ షబ్నమ్ సింగ్. 2016, నవంబర్ 30న చండీగఢ్‌లో ఈ జంటకు పెళ్లయింది. ఆ సందర్భంగా షబ్నమ్ సింగ్! ‘మొత్తానికి మా వాడికి సరైన అమ్మాయే దొరికింది’ అంటూ తన సంతోషాన్ని ప్రకటించింది.
యువరాజ్ సింగ్ జీవితం ఊహించని మలుపులమయం. క్రికెటర్‌గా సక్సెస్‌ఫుల్.. క్యాన్సర్‌నీ జయించాడు. ప్రియుడిగా ఓడిపోయిన అతణ్ణి తన ప్రేమతో గెలిపించి.. చక్కటి భర్తగా నిలబెట్టింది హాజెలే. ఇటీవలే వీరికి బాబు జన్మించాడు.
-ఎస్సార్
చదవండి: Lara Dutta Love Story: ఇద్దరితో తెగతెంపులు, ఆల్‌రెడీ పెళ్లైన టెన్నిస్ స్టార్‌తో నటి వివాహం
Comments
Please login to add a commentAdd a comment