యువీ... అదే జోరు | Yuvraj Singh ton powers India 'A' | Sakshi
Sakshi News home page

యువీ... అదే జోరు

Published Mon, Sep 16 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

యువీ... అదే జోరు

యువీ... అదే జోరు

బెంగళూరు: ఐపీఎల్-6 అనంతరం తొలిసారి బ్యాట్ పట్టిన డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత మైదానంలో అసలు సిసలైన ఆటతీరు చూపుతూ బౌండరీల వర్షం కురిపించాడు. తన ఫామ్‌కు ఎలాంటి ఢోకా లేదంటూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ  (89 బంతుల్లో 123; 8 ఫోర్లు; 7 సిక్స్) సెంచరీతో అదరగొట్టాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి అనధికార వన్డేలో భారత్ ‘ఎ’ జట్టు 77 పరుగుల తేడాతో నెగ్గింది. యువీ విజృంభణకు యూసుఫ్ పఠాన్ (32 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు; 6 సిక్స్‌లు) తుఫాన్ ఆటతీరు తోడవ్వడంతో భారత్ నిర్ణీత 42 ఓవర్లలో నాలుగు వికెట్లకు 312 పరుగులు సాధించింది.
 
 మన్‌దీప్ సింగ్ (78 బంతుల్లో 67; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 39.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటయ్యింది. దేవ్‌నారాయణ్ (63 బంతుల్లో 57; 6 ఫోర్లు; 1 సిక్స్), నర్స్ (50 బంతుల్లో 57; 6 ఫోర్లు; 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. నర్వల్, వినయ్, రాహుల్ శర్మ, యూసుఫ్‌లకు తలా రెండేసి వికెట్లు దక్కాయి. మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. రెండో వన్డే ఇదే వేదికపై మంగళవారం జరుగుతుంది.
 
 యువీ, పఠాన్ దూకుడు
 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న ఉన్ముక్త్ చంద్ (1) వికెట్‌ను కోల్పోయింది. కొద్ది సేపటికే మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (37 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా రస్సెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో మన్‌దీప్ సింగ్, యువీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఎనిమిది ఓవర్లపాటు నిదానంగా ఆడిన ఈ జోడి ఆ తర్వాత జూలు విది ల్చింది.  యువీ ఆచితూచి ఆడినా మన్‌దీప్ మాత్రం వేగంగా ఆడుతూ 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు యువీ పూర్తి ఫిట్‌గా కనిపించడమే కాకుండా క్రీజు మధ్య వేగంగా పరిగెత్తుతూ పరుగులు సాధించాడు. ఐపీఎల్-6లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొని సీనియర్ జట్టులో చోటు కోల్పోగా ఫ్రాన్స్‌లో తీసుకున్న కఠిన శిక్షణ వృథా కాలేదు. మన్‌దీప్ అవుట్ కాగానే బాధ్యతను చేతుల్లోకి తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 100 పరుగులు జత చేరాయి. తొలి బౌండరీ కోసం 39 బంతులు ఆడిన యువీ 61 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా ఆ తర్వాత 19 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. మిల్లర్ వేసిన 35వ ఓవర్‌లో వరుసగా 6, 4, 6, 6తో 23 పరుగులు సాధించాడు. ఇదే ఊపులో 37వ ఓవర్‌లో యూసుఫ్ పఠాన్ 6, 4, 4, 6, 6తో విరుచుకుపడడంతో 28 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్ యువీ వంతు.. ఇందులో తను 6, 4, 4, 6, 4 పరుగులు రాబట్టడంతో కేవలం 4 ఓవర్లలోనే 85 పరుగులు సమకూరాయి. ఇదే ఓవర్‌లో యువరాజ్ 80 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. 40వ ఓవర్‌లో బోనర్ వేసిన ఫుల్ టాస్ బంతికి యువీ క్యాచ్ అవుటయ్యాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 55 బంతుల్లోనే 125 పరుగులు సాధించింది. చివరి ఓవర్‌లో పఠాన్ మూడు సిక్స్‌లు బాదడంతో భారత్ ‘ఎ’ స్కోరు 300 పరుగులు దాటింది.
 
 భారీ లక్ష్యమైనప్పటికీ విండీస్ ‘ఎ’ బెదరకుండా బ్యాటింగ్ ఆరంభించింది. తొలి మూడు ఓవర్లలో పరుగులన్నీ ఫోర్ల ద్వారానే రాబట్టింది. నాలుగో ఓవర్‌లో బోనర్ (15 బంతుల్లో 16; 4 ఫోర్లు) వికెట్‌ను వినయ్ పడగొట్టాడు. ఆ తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించి పరుగులు రాబట్టినా వికెట్లు కూడా కోల్పోవడంతో విండీస్ చిక్కుల్లో పడింది. మిడిలార్డర్‌లో దేవ్‌నారాయణ్, చివర్లో నర్స్ శాయశక్తులా పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
 
 స్కోరు వివరాలు
 భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) కమ్మిన్స్ (బి) రస్సెల్ 23; చంద్ (సి) థామస్ (బి) కమ్మిన్స్ 1; మన్‌దీప్ సింగ్ (బి) మిల్లర్ 67; యువరాజ్ (సి) బీటన్ (బి) బోనర్ 123; యూసుఫ్ నాటౌట్ 70; నమన్ ఓజా నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (42 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 312
 వికెట్ల పతనం: 1-8; 2-47; 3-147; 4-272.
 బౌలింగ్: కమ్మిన్స్ 9-1-50-1; బీటన్ 8-0-72-0; రస్సెల్ 4-0-17-0; మిల్లర్ 9-0-62-1; నర్స్ 6-0-58-0; దేవ్‌నారాయణ్ 4-0-20-0; బోనర్ 2-0-30-1.
 విండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్: బోనర్ (సి) నమన్ ఓజా (బి) వినయ్ 16; పావెల్ (సి) నర్వల్ (బి) వినయ్ 17; ఎడ్వర్డ్స్ (సి) నమన్ ఓజా (బి) నర్వల్ 19; దేవ్‌నారాయణ్ (బి) మన్‌దీప్ (బి) రాహుల్ 57; ఫ్లెచర్ (సి) ఉన్ముక్త్ (బి) యూసుఫ్ 29; థామస్ ఎల్బీడబ్ల్యు (బి) యూసుఫ్ 10; రస్సెల్ (రనౌట్) 1; నర్స్ (సి) నమన్ ఓజా (బి) నర్వల్ 57; మిల్లర్ (సి అండ్ బి) రాహుల్ 2; బీటన్ హిట్ వికెట్ (బి) ఉన్ముక్త్ 15; కమ్మిన్స్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (39.1 ఓవర్లలో ఆలౌట్) 235
 వికెట్ల పతనం: 1-24; 2-47; 3-58; 4-112; 5-139; 6-140; 7-176; 8-181; 9-205; 10-235.
 బౌలింగ్: ఉనాద్కట్ 6-0-41-1; నర్వల్ .1-0-28-2; వినయ్ 7-0-42-2; రాహుల్ 9-0-57-2; యూసుఫ్ 7-0-47-2; యువరాజ్ 4-0-17-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement