
జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా...
రాబోయే ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చి... జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ జహీర్ ఖాన్ భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: రాబోయే ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చి... జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ జహీర్ ఖాన్ భావిస్తున్నారు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా మరోసారి తమ అంతర్జాతీయ కెరీర్‌ను పునఃసమీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ యువీని రికార్డు స్థాయిలో రూ. 16 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ‘క్యాన్సర్ చికిత్స తర్వాత నాకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా కష్టపడి వాటిని సమర్థంగా ఎదుర్కొన్నా. ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నా.
ఇటీవల దేశవాళీల్లో కూడా మెరుగ్గా ఆడా. కాబట్టి ఐపీఎల్‌లో రాణిస్తాననే నమ్మకం ఉంది. దీనిద్వారా జాతీయ జట్టులోకి రావాలని భావిస్తున్నా’ అని యువరాజ్ పేర్కొన్నాడు. మరోవైపు ఢిల్లీకి ఆడనున్న జహీర్ కూడా ఐపీఎల్ సరైన వేదిక అని చెప్పాడు. ‘మళ్లీ క్రికెట్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. కొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉండటం తో గాడిలో పడాలి. జాతీయ జట్టులోకి రావాలంటే ఐపీఎల్ మొదటి అడుగు. ఒక్కో మ్యాచ్‌లో నాణ్యమైన ప్రదర్శనతో ముందుకెళ్తా. మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి డీడీ తరఫున మా జైత్రయాత్ర కొనసాగిస్తాం’ అని జహీర్‌ఖాన్ వ్యా ఖ్యానించాడు.