
బెంగళూరు: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలంటే మూడు డాట్ బంతులు చాలని టీమిండియా యువ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. మాక్స్‌వెల్‌ను వరుస మూడు వన్డేల్లో పెవిలియన్‌కు పంపించిన ఈ హరియాణ బౌలర్ వీటిలో రెండు స్టంప్ అవుట్‌లు చేయడం విశేషం. దీనిపై స్పందించిన చాహల్ ‘మాక్స్‌వెల్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని స్టంప్స్ వైపు వేయకుండా అవుట్ సైడ్ స్టంప్స్‌కు వేస్తాను. నేను వేసే ఓవర్‌లో ఖచ్చితంగా రెండు నుంచి మూడు బంతులు డాట్ అవుతాయి. దీంతో మాక్స్‌వెల్ ఒత్తిడికి లోనై క్రీజు వదలి భారీ షాట్‌కు ప్రయత్నిస్తాడు. ఇదే స్టంప్ అవుట్‌ల వెనుక ఉన్న రహస్యమని’ ఈ యువ బౌలర్ చెప్పుకొచ్చాడు.
ఆసీస్ కీలక ఆటగాడైన వార్నర్ క్రీజులో కుదురుకుంటే విధ్వంసం సృష్టిస్తాడని ఈ యువ స్పిన్నర్ పేర్కొన్నాడు. దీంతో వార్నర్ ఎంత త్వరగా అవుట్ చేస్తే మాకు మిడిల్ ఓవర్లలో అంత ఒత్తిడి తగ్గుందోని చాహాల్ పేర్కొన్నాడు. ఇక్కడి పరిస్థితులను ఆసీస్ స్పిన్నర్ల కన్నా భారత స్పిన్నర్లే ఎక్కవ సద్వినియోగం చేసుకున్నారని, భారత స్పిన్నర్లు మొత్తం 13 వికెట్లు పడగొట్టారని చాహల్ పేర్కొన్నాడు. ఇక బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేస్తే బౌలర్లు ఎలాంటి ఒత్తిడిలేకుండా బౌలింగ్ చేయగలరని చాహల్ వ్యాఖ్యానించాడు.