కెరీర్ ముగిసినట్లే(నా)? | Zaheer Khan must contemplate future: Dravid | Sakshi
Sakshi News home page

కెరీర్ ముగిసినట్లే(నా)?

Published Fri, Feb 21 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

కెరీర్ ముగిసినట్లే(నా)?

కెరీర్ ముగిసినట్లే(నా)?

పభావం చూపలేకపోతున్న జహీర్   
 గాయాల తర్వాత తగ్గిన పదును
 
 కపిల్‌దేవ్ తర్వాత భారత్‌కు ఆ స్థాయి పేస్ బౌలర్‌గా నిలిచిన జహీర్ ఖాన్ ఇప్పుడు తన పదును కోల్పోయాడా ?   విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన చరిత్రాత్మక, చిరస్మరణీయ విజయాల్లో జట్టును నడిపించిన జహీర్ బౌలింగ్‌లో కళ తప్పిందా? ఈ పేసర్ తనదైన స్థాయిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి ఎన్నాళ్లైంది? ఇకపై అతను భారత బౌలింగ్ భారాన్ని మోయగలడా? యువ పేసర్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మళ్లీ మునుపటి మెరుపులు చూపించగలడా? లేక తన పరుగును ఆపివేస్తాడా!  

- సాక్షి క్రీడా విభాగం
 
 నిస్సందేహంగా కపిల్ తర్వాత భారత అత్యుత్తమ పేసర్ జహీర్ ఖాన్. అలాంటి గొప్ప బౌలర్ 120-125 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తూ జట్టులో కొనసాగడం నేను చూడలేను           
 - ద్రవిడ్
 
  మూడేళ్ల తర్వాత...
 ఎప్పుడో 2010 అక్టోబర్‌లో జహీర్ ఖాన్ ఆఖరి సారిగా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.  ఆ తర్వాత గత వారం వెల్లింగ్టన్‌లో ప్రత్యర్థి స్కోరు 600 దాటాక, 51 ఓవర్లు వేస్తే గానీ మరోసారి 5 వికెట్లు దక్కలేదు. ఈ మధ్య కాలంలో అతను ఆడిన 18 టెస్టుల్లో జహీర్ ప్రదర్శన నామమాత్రంగానే ఉంది. అప్పుడప్పుడు వికెట్లు తీయగలిగినా...ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం ప్రదర్శించే స్థాయిలో అతని బౌలింగ్ ఎప్పుడూ లేదు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో గతంలో అద్భుత బౌలింగ్‌తో ఎన్నో విజయాలు అందించిన జహీర్ ఇప్పుడు ఒక సాధారణ బౌలర్‌గా మారిపోయాడు. ఇప్పుడు ఆనాటి వేగమూ లోపించింది. ‘నిస్సందేహంగా కపిల్ తర్వాత భారత అత్యుత్తమ పేసర్ జహీర్ ఖాన్. అలాంటి గొప్ప బౌలర్ 120-125 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తూ జట్టులో కొనసాగడం నేను చూడలేను’ అని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించడం జహీర్ ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోంది.

 వెంటాడిన గాయాలు
 జహీర్ ఖాన్ కెరీర్ ఆసాంతం గాయాలతోనే సహవాసం చేశాడు. నిలకడగా రాణిస్తూ, జట్టుకు  అండగా నిలుస్తున్నాడని కనిపించిన ప్రతీసారి... గాయంతో మ్యాచ్‌నుంచి తప్పుకోవడమో, ఫిట్‌నెస్ లేక ఆటకు దూరం కావడమో తరచూ జరిగింది. 2003-04లో ఆస్ట్రేలియాలో తొలి సారి కండరాల గాయం జహీర్ జోరుకు రెండేళ్ల పాటు బ్రేక్ వేసింది. ఆ తర్వాత ‘పునరాగమనం’ అనే పదం అతనికి విశేషణంగా మారిపోయింది. ఎప్పుడు తిరిగి జట్టులోకి వచ్చినా...మళ్లీ కొన్నాళ్లకే మరో కొత్త గాయంతో ఖాన్ జట్టుకు దూరమయ్యాడు. తనకు ఎన్ని శస్త్ర చికిత్సలు జరిగాయో జహీర్  కూడా లెక్క పెట్టకపోవచ్చు! ఫ్రాన్స్‌లో ప్రత్యేక శిక్షణ ద్వారా ఫిట్‌నెస్‌ను మెరుగు పర్చుకొన్న అతను దాదాపు ఏడాది విరామం తర్వాత ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనతో మళ్లీ జట్టులోకి వచ్చాడు.
 
 
 నడిపించలేని నాయకుడు
 దక్షిణాఫ్రికాలాంటి బౌన్సీ వికెట్లపై జహీర్ ఖాన్ ఎంతో కీలకమని, సీనియర్‌గా అతని అనుభవం యువ బౌలర్లకు అండగా నిలుస్తుందనే కారణంతోనే అతడిని ఎంపిక చేశారన్నది వాస్తవం. అయితే జూనియర్లకు మార్గదర్శిగా నిలవడం మాట ఎలా ఉన్నా...తన సాధారణ ఆటతో మాత్రం జహీర్ నిరాశ పర్చాడు. జొహన్నెస్‌బర్గ్‌లో 223 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన అతను, డర్బన్‌లో 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు.

 
 ముఖ్యంగా 450కి పైగా పరుగుల లక్ష్యాన్ని సఫారీలు దాదాపుగా ఛేదించారంటే కీలక సమయాల్లో జహీర్ విఫలం కావడం కూడా ఒక కారణం. ఇక న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లో అతను ప్రభావం చూపలేకపోగా, రెండో టెస్టు మ్యాచ్‌లో 5 వికెట్లు తీసినా అప్పటికే మ్యాచ్‌పై జట్టు పట్టు కోల్పోయింది. ఈ నాలుగు టెస్టుల్లో 16 వికెట్లు తీయగలిగినా...వెల్లింగ్టన్‌లో ఇషాంత్ తరహాలో ఏ దశలో కూడా కూడా జహీర్ ప్రమాదకరంగా కనిపించలేదు.
 
   సత్తా ఉందా...
 గత 8 ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు అతను 26.3, 34, 30, 51 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయడం చూస్తే ఫిట్‌నెస్‌పరంగా అతను బాగున్నట్లే లెక్క! అయితే ఆట మాత్రం నిరాశాజనకంగానే ఉంది. ఈ ఏడాది జూన్‌లో భారత్ ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులు ఆడనుంది. ‘జహీర్ ఆ ఐదు టెస్టులు ఆడగలడా అన్నదే నా సందేహం. చివరి వరకు తీవ్రంగా కష్ట పడుతూ ఆడాలని అతనూ అనుకోడు. కాబట్టి వచ్చే సిరీస్ గురించి స్వయంగా జహీర్, సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని ద్రవిడ్ సూచించారు. అయితే భారత బౌలింగ్ మాజీ కోచ్ ఎరిక్ సిమన్స్, పాక్ దిగ్గజం వసీం అక్రమ్ మాత్రం జహీర్ ఇంకా భారత్‌కు ఉపయోగ పడగలడని అంటున్నారు.

‘జహీర్ వేగం గురించి ఆలోచించనవసరం లేదు. అతను ప్రధానంగా స్వింగ్, వైవిధ్యం ఉన్న బౌలర్. ఎలాగూ కొత్త బౌలర్లు ఫాస్ట్‌గానే బౌలింగ్ చేస్తారు కాబట్టి జహీర్‌ను ఫాస్ట్ బౌలర్ కోణంలో కాకుండా ఒక కీలక బౌలర్‌గానే భావిస్తే కెరీర్ చివర్లో రిచర్డ్ హ్యాడ్లీ తరహాలో ఫలితాలు ఇవ్వగలడు’ అని సిమన్స్ విశ్లేషిస్తే...‘ఈ వయసులో ఇన్ని సార్లు పునరాగమనం చేయగలిగాడంటే అది సాధారణ విషయం కాదు. అతను మైదానంలో ఉంటే యువ బౌలర్లకు ఎంతో లాభిస్తుంది’ అని అక్రమ్ వ్యాఖ్యానించారు.
 
  భవిష్యత్తు ఏమిటి...
 భారత్ తరఫున జహీర్ వన్డేలు, టి20 మ్యాచ్‌లు ఆడి దాదాపు ఏడాదిన్నర దాటింది కాబట్టి ఈ ఫార్మాట్‌లో అతను ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఇక మిగిలింది టెస్టులే. జహీర్ ప్రస్తుతం 36 ఏళ్లకు చేరువవుతున్నాడు. ఒక పేసర్ ఈ వయసులో టెస్టు క్రికెట్ ఆడటం అంత సులభం కాదు. 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టిన అతను వ్యక్తిగత మైలురాయి వంద టెస్టులకు చేరువగా ఉన్నాడు. జూన్‌లో ఇంగ్లండ్‌లో సిరీస్‌కు ఐపీఎల్ ప్రదర్శనే ప్రామాణికం కాకపోయినా అతని ఫిట్‌నెస్‌ను పరిశీలించేందుకు సెలక్టర్లకు ఒక అవకాశంలాంటిది. మన దేశంలో వ్యక్తిగత మైలురాళ్లకు ఉండే ప్రాధాన్యతను బట్టి చూస్తే జహీర్ మిగిలిన ఎనిమిది టెస్టులు ఆడే అవకాశం రావచ్చు. లేదంటే స్వయంగా తానే తన ఆటను విశ్లేషించుకున్నా అతని కెరీర్ చివరి దశకు చేరుకుందనే చెప్పవచ్చు.
 
 కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు
 భారత టెస్టు జట్టులో స్థానం కోసం బాగా పోటీ ఉంది. ప్రస్తుతం జహీర్, ఇషాంత్, షమీ నిలకడగా తుది జట్టులో ఉంటున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్, ఈశ్వర్ పాండే... ఇలా బెంచ్ మీద తుది జట్టులో స్థానం ఎదురుచూస్తున్న వారి జాబితా పెద్దగానే ఉంది.
 

 ఈ నేపథ్యంలో జహీర్ మీద ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. ప్రదర్శన బాగుంటేనే బౌలింగ్ నాయకుడిగా సహచరుల నుంచి గౌరవం దక్కుతుంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో జహీర్‌పై ఇషాంత్ శర్మ నోరుపారేసుకున్నాడు. నిజానికి జహీర్ మంచి ఫామ్‌లో ఉండి, నిలకడగా రాణిస్తుంటే ఇషాంత్ అంత సాహసం చేసేవాడు కాదు. కాబట్టి తనకంటే జూనియర్ల ముందు చులకన కావడం కంటే గౌరవంగా తప్పుకోవడమే మేలేమో..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement