
జహీర్ ఖాన్ దూరం..
ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కు ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరమయ్యాడు. గాయం కారణంగా గత మ్యాచ్ నుంచి వైదొలిగిన జహీర్ ఖాన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని తొలుత భావించారు.
అయితే అతను ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో హైదరాబాద్ తో మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు డేర్ డెవిల్స్ యజమాన్యం స్పష్టం చేసింది. అతని స్థానంలో కరుణ్ నాయర్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కాగా, జహీర్ గాయంపై వైద్య బృందం స్పష్టత ఇచ్చిన తరువాతే మాత్రమే అతను మిగతా మ్యాచ్ ల్లో పాల్గొనే అంశం తేలనుంది.