జ్వెరెవ్‌కు ఝలక్‌ | Zverev loses to Verdasco at French Open | Sakshi
Sakshi News home page

జ్వెరెవ్‌కు ఝలక్‌

Published Wed, May 31 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

జ్వెరెవ్‌కు ఝలక్‌

జ్వెరెవ్‌కు ఝలక్‌

తొలి రౌండ్‌లోనే ఓడిన జర్మనీ యువతార
► ఆండీ ముర్రే శుభారంభం
►  ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ


పారిస్‌: అద్భుతం చేస్తాడని ఆశించిన జర్మనీ యువ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే చేతులెత్తేశాడు. ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్‌)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తొమ్మిదో సీడ్‌ జ్వెరెవ్‌ 4–6, 6–3, 4–6, 2–6తో ఓడిపోయాడు. పది రోజుల క్రితం రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)ను ఓడించి విజేతగా నిలిచిన జ్వెరెవ్‌... అదే జోరును గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో కొనసాగించడంలో విఫలమయ్యాడు.

‘అత్యంత చెత్తగా ఆడాను. అందుకే ఓడాను. అయితే నా జీవితంలో ఇదేమీ విషాదం కాదు. రోమ్‌ టోర్నీలో నేను అద్భుతంగా ఆడాను. విజేతగా నిలిచాను. ఇక్కడ బాగా ఆడలేదు. అందుకే తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాను. కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది’ అని 20 ఏళ్ల జ్వెరెవ్‌ వ్యాఖ్యానించాడు. ఈ గెలుపుతో మాడ్రిడ్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో జ్వెరెవ్‌ చేతిలో ఎదురైన ఓటమికి వెర్డాస్కో బదులు తీర్చుకున్నట్టయింది.

మరోవైపు టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) తొలి రౌండ్‌లో 6–4, 4–6, 6–2, 6–0తో కుజ్‌నెత్సోవ్‌ (రష్యా)పై నెగ్గి శుభారంభం చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6–2, 7–6 (8/6), 6–3తో కొవాలిక్‌ (స్లొవేకియా)పై, 15వ సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 6–4, 7–5, 6–0తో డస్టిన్‌ బ్రౌన్‌ (జర్మనీ)పై, 18వ సీడ్‌ నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) 6–3, 7–6 (7/4), 6–3తో కోల్‌ష్రైబర్‌ (జర్మనీ)పై విజయం సాధించారు.

జొహనా కోంటాకు షాక్‌...
మహిళల సింగిల్స్‌ విభాగంలో మరో సంచలనం నమోదైంది. టాప్‌ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... ఆమె సరసన ఏడో సీడ్‌ జొహానా కోంటా (బ్రిటన్‌) చేరింది. తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి సు వీ సెయి (చైనీస్‌ తైపీ) 1–6, 7–6 (7/2), 6–4తో కోంటాను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–4, 6–3తో ష్వెదోవా (కజకిస్తాన్‌)పై, 12వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–3, 6–2తో బార్టీ (ఆస్ట్రేలియా)పై, యుజిని బుచార్డ్‌ (కెనడా) 2–6, 6–3, 6–2తో ఒజాకి (జపాన్‌)పై గెలిచారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement