
అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు
► పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు
► బెళగావిలో రెండు గంటల పాటు
► రైళ్ల రాక పోక లు బంద్
సాక్షి, బళ్లారి(బెళగావి) : కర్ణాటకలోని హుబ్బళ్లి నైరుత్య డివిజనల్ రైల్వే అధికారులకు మైసూరు-అజ్మీర్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో బాంబు అమర్చినట్లు బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పడంతో కలకలం రేగింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. వెంటనే బెళగావి సమీపంలోని డేసూరు రైల్వే స్టేషన్‌లో స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపివేసి పోలీసులు, బాంబు స్క్వాడ్ అధికారులు పెద్ద సంఖ్యలో మోహరించి సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబులు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈసందర్భంగా రైలులోని ఒక బోగీలో రెండు నకిలీ గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఉత్తుత్తి బాంబు ఫోన్ కాల్ బెళగావిలో తీవ్ర కలకలం రేపింది. బాంబు కలకలంతో సుమారు రెండు గంటల పాటు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి వేయడంతో బెళగావి మీదుగా వెళ్లాల్సిన అన్ని రైళ్ల రాకపోకలు ఎక్కడివక్కడ ఆపి వేశారు.