లాడ్జి గదిలోరూ.1.19 కోట్ల విలువైన నగలు మాయం | 1.19 Crore worth of jewelry ate lodge room | Sakshi
Sakshi News home page

లాడ్జి గదిలోరూ.1.19 కోట్ల విలువైన నగలు మాయం

Published Mon, Aug 4 2014 3:15 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

1.19 Crore worth of jewelry ate lodge room

బెంగళూరు: ఓ లాడ్జి గదిలో ఉంచిన దాదాపు నాలుగు కేజీల బంగారు నగలు మాయం కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అదే లాడ్జిలో మూడు కేజీల నగలు స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన చిక్కపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీసీపీ ఎస్.రవి కథనం మేరకు.. రాజస్థాన్‌కు చెందిన హుకుంసింగ్ బెంగళూరులోని విజయనగరలో నివాసం ఉంటున్నాడు.

ఇతను నలుగురితో కలిసి చిక్కపేటలోని రంగస్వామి ఆలయానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకాష్ పేరుతో జ్యువెలర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నిత్యం ముంబాయి నుంచి రూ. కోట్ల విలువైన బంగారు నగలు ఇక్కడకు తెచ్చి వివిధ దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. అదే కట్టడంలోని  నాలుగు అంతస్తులో ఉన్న  సుప్రీం లాడ్జ్‌లో హుకుంసింగ్ గది(నంబర్ 41)ని అద్దెకు తీసుకొని అక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించేవాడు.
 
రెండు రోజుల క్రితం ముంబాయి నుంచి నాలుగు కేజీల 200 గ్రాముల బంగారు నగలు తెచ్చి గదిలో పెట్టాడు. శనివారం భాగస్వాములతో పాటు, జ్యువెలర్స్‌లో పని చేస్తున్న సిబ్బంది ఆగదిలోకి వెళ్లారు. అయితే శనివారం రాత్రి సమయానికి నాలుగు కేజీల 200 గ్రాముల బంగారు నగలు చోరీ అయ్యాయని హుకుంసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్‌లోని అన్ని గదులను తనిఖీ చేయగా మూడు కేజీల బంగారు నగలు కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు.

లాడ్జ్‌లోని మొదటి అంతస్తులో మాత్రమే  సీసీ కెమెరాలు ఉండటంతో  హుకుంసింగ్ ఉంటున్న గదిలోకి ఎవరు వచ్చి వెళ్లారనే వివరాలు లభ్యం కాలేదు. అయితే సీసీ కెమెరాలోని వీజ్యువల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుకుంసింగ్, అతని భాగస్వాములు, దుకాణ సిబ్బంది, లాడ్జ్  సిబ్బందితో వివరాలు సేకరించిన పోలీసులు ఫిర్యాదుదారుడితోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీసీ తెలిపారు. ఇదిలా ఉండగా హుకుంసింగ్ తన బంగారు నగల దుకాణంలోని నగలకు సంబంధించి ఇన్సూరెన్‌‌స చేసినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement