సంతోషమొచ్చినా, దుఃఖం కలిగినా ఎక్కువ మంది మద్యం తాగడానికి పరుగులు తీస్తుంటారు. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మందుబాబులకు సహజంగానే సంతోషం ఎక్కువైంది. అంతే ఒక్కరోజులో రూ.164 కోట్ల విలువైన మద్యం తాగేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:పాత ఏడాది తెరమరుగైపోతూ కొత్త ఏడాది తెరపైకి వస్తున్న సందర్భంగా గత నెల 31న సాయంత్రం నుంచే టాస్మాక్ దుకాణాలు, బార్లు కిటకిటలాడి పోయాయి. మద్యంమత్తులో రోడ్డుపై వీరంగం చేసినా కొత్త సంవత్సరం కోలాహలం లెమ్మని పోలీసులు సైతం చూసీచూడనట్లు ఊరుకోవాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ముందుగానే పసిగట్టిన మందుబాబులు రాత్రి 12 గంటల వరకు మద్య సేవనంలో తరించారు. తమిళనాడులో మొత్తం 6,800కు పైగా టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. టాస్మాక్‌కు అనుబంధంగా ప్రత్యేక (ఎలైట్) బార్లు ఉన్నాయి. రాష్ట్రంలో సాధారణ దినాల్లో ఒక్క రోజుకు రూ.50 కోట్లు, పండుగ సెలవులు, శని, ఆదివారాల్లో రూ.80 కోట్ల అమ్మకాలు సాగుతాయి. సాధారణ రోజుల్లో ఒంటరిగా మద్యం తాగేవారు సెలవు రోజుల్లో స్నేహితులను సైతం వెంట తెచ్చుకుంటారు. ఈ కారణంగా సెలవు రోజుల్లో టాస్మాక్ దుకాణాల వద్ద రేషన్ షాపుల్లో క్యూ కట్టారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో టాస్మాక్ దుకాణాల వద్ద సందడి ఏడాదికేడాదికీ పెరిగిపోతోంది. గత నెల 31న సాయంత్రం నుంచి ఈ నెల 1వ తేదీ సాయంత్రం వరకు మద్యం అమ్మకాలను లెక్కకట్టిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. 31న రూ.84 కోట్లు, 1న రూ.80 కోట్లు అమ్మకాలు సాగినట్లు తెలుసుకున్నారు.
మద్యం అమ్మకాల్లో తిరుపూరు ఫస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగినా తిరుపూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. కాంచీపురం, చెన్నై జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది ఆఖరు రోజున రూ.82 కోట్లు, జనవరి 1న రూ.60 కోట్లు లెక్కన మొత్తం రూ.142 కోట్ల అమ్మకాలు సాగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.22 కోట్లు ఎక్కువ అమ్మకాలతో టాస్మాక్ రికార్డు సృష్టించింది.
రూ.164 కోట్లు తాగేశారు
Published Sun, Jan 4 2015 2:44 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement