దురాశ, అత్యాశ అనేవి మనిషి గుణాలు. లోకల్ ట్యాక్సెస్ ఎక్స్‌ట్రాలా దీనికి లోభం తోడు. తత్వం బోధపడితేనే కానీ కట్టలోంచి ఒకటి తీసి ఇతరులకు ఇవ్వడానికి మనసు రాదు.
‘‘నూతన సంవత్సరం వస్తే గానీ తత్వం బోధపడదు. జ్ఞానబోధ చేయడానికి న్యూ ఇయరంత మంచి సందర్భం మరొకటి ఉండదు.’’‘‘అదేమిటి స్వామీజీ.. న్యూ ఇయర్ అంటే ఎవరికైనా క్యాలండర్లూ, డైరీలు! మద్యం, డ్యాన్సులు ఇత్యాది వినోదాలు!! అరుపులూ, కేకలు, ఉత్సాహాలూ, ఉత్సవాలు గట్రాగట్రా ఎట్సెట్రాలు!!! రాత్రిళ్లు టూ వీలర్ మీద త్రిబుల్ రైడింగ్‌లు, లేట్‌నైట్ విష్షింగులు. వీటితో తత్వజ్ఞానం ఎలా సాధ్యం స్వామీ?’’
‘‘అక్కడే ఉంది నాయనా కిటుకూ. అనుభవం అయితే గాని తత్వం బోధపడదు అనే నానుడి ఉంది చూశావ్. ఆ స్కీమ్ కింద ఇది సాధ్యపడుతుంది.’’‘‘స్వామీజీ.. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా. సదరు తత్వజ్ఞానాన్ని శాంపిల్‌గా నాకే కాస్తంత ఉపదేశించవచ్చు కదా.’’ ‘‘సరే విను.. నీకు రకరకాల క్యాలండర్లు కావాలని అనిపిస్తుంది.
పదిమందిని అడిగితే ఒక్కడైనా ఇవ్వకపోతాడా అనే స్కీము కింద కొందరినీ, ఎందుకైనా మంచిది అనే పాలసీ కింద మరికొందరిని అడుగుతావు. చాలామంది ఇచ్చేస్తారు. దురాశ, అత్యాశ అనేవి మనిషి గుణాలు. లోకల్ ట్యాక్సెస్ ఎక్స్‌ట్రాలా దీనికి లోభం తోడు. వాటిని ఇతరులకు ఇవ్వడానికి అంత తేలిగ్గా మనసు రాదు. నీ మనసులోని ఆ దుర్గుణాల్లాగే నీ ఇంట్లో ఈ క్యాలండర్ల కట్ట! నీ పలుకుబడికి నిదర్శనంలా పర్వతమంతటి ఈ పెద్ద గుట్ట మొదట్లో భార్యకు నచ్చుతుంది. కానీ త్వరలోనే ఆమె జ్ఞాననేత్రాలు విచ్చుకుంటాయి. అగ్గిపెట్టెంత ఈ కొంపలో ఈ కాగితరాశిని చూసి అగ్గిమీద గుగ్గిలమవుతుంది. అంతే.. ఆనాటి నుంచి ఆ దుర్గుణాల బ్యాగేజీని... ఈ కేలండర్ల లగేజీని వదిలించుకోడానికి ట్రై చేస్తావు. డైరీలకూ ఇంచుమించు ఇదే సూత్రం నాయనా.
’’‘‘మరి మొదట నేను చెప్పిన మద్యం, డాన్సులూ, ట్రిపుల్ రైడింగులో?’’ ‘‘తల్లో మెదడూ, నోట్లో నాలుకా ఉండాలేగానీ.. అన్నింటికీ వివరం చెప్పచ్చు. రాత్రి నిన్ను తేలిక చేసిన మద్యం.. మర్నాడు హ్యాంగోవరులా తలలో బరువై మెదడును హ్యాంగు చేస్తుంది. రాత్రి డ్యాన్సింగులన్నీ ఏడాది మొదటిరోజున ఒళ్లునొప్పుల రూపంలో చిరకాలం గుర్తుంటాయి. ఇక ట్రిపుల్ రైడింగులంటావా.. బై ఒన్ గెట్ త్రీ ఆఫర్‌లా ‘ఒన్ యాక్సిడెంట్.. త్రీ పేషెంట్స్’ అంటూ హాస్పిటళ్లకూ, అందులోని డాక్టర్లకూ మేలు చేస్తాయి. ఇలా న్యూ ఇయర్ ఈవెంటుల్లోని ప్రతిదాన్నీ తీసుకొని ఇలా ఇయరంతా చెప్పినా ఇంకా మిగిలిపోయేంత జ్ఞానాన్నివ్వగలను రా ఢింభకా. సరే గానీ.. పంచ్ డైలాగుల కోసం మూడ్ కావాలి. మాటలు ఒక ఫ్లోలో వెల్లువలా రావాలి. కాబట్టి... కాక్‌టెయిల్ మిక్స్ చెయ్. మంచింగ్‌కు రెడీ చెయ్’’
Comments
Please login to add a commentAdd a comment