
రజనీ చిత్రం కోసం 20కోట్లతో సెట్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కోసం చెన్నైలోని ఓ ప్రాంతం అత్యాధునిక నగరంగా మారుతోందన్నది తాజా సమాచారం.రజనీకాంత్ ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా ఏకకాలంలో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. అందులో ఒకటి 2.ఓ. ఇది ఎందిరన్ చిత్రానికి సీక్వెల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అద్భుత సృష్టి 2ఓ చిత్రం అని చెప్పవచ్చు.ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలో రూపొందనటువంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నమోదు కానున్న చిత్రం ఇది.ఈ చిత్రాన్ని లైకా సంస్థ 250 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ సరసన ఇంగ్లాండ్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా మారుతున్నారు. చెన్నైలో ప్రారంభమైన 2ఓ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో
తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందన్నది సమాచారం. ఈ చిత్రం కోసం స్థానిక పూందమల్లి సమీపంలో రూ.20 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారు.ఇది పలు ఏకరాల స్థలంలో ఒక ఆధునిక నగరంగా తయారవుతోందన్నది గమనార్హం.ఈ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.ఇందు కోసం హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్ కెన్నీ పెట్స్ తన టీమ్‌తో చెన్నైకి చేరుకుని ఆ సెట్‌లో ఇప్పటికే ఫైట్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ స్టంట్ మాస్టర్ ది రాక్,ట్రైనింగ్ డే సీక్వెల్స్ తదితర హాలీవుడ్ చిత్రాలకు పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్రంలో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలను రప్పించారు.
సెల్‌ఫోన్స్ నిషిద్దం
షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దర్శకుడు శంకర్ చిత్ర యూనిట్‌కు కొన్ని నిబంధనలను విధించారు. షూటింగ్ స్పాట్‌కు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. చిత్రానికి సంబంధించిన వారు మినహా బయటి వారెవరికి షూటింగ్ స్పాట్‌కు రావడానికి అనుమతి నిషిద్దం లాంటి నిబంధనలు విధించారట.