దొంగతనం కోసం పీజీ హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు..
బెంగళూరు (బనశంకరి): దొంగతనం కోసం పీజీ హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు మహిళా టెక్కీపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డీసీపీ బోరలింగయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని పరప్పన అగ్రహారంలో ఉన్న ఓ పీజీ (పేయింగ్ గెస్ట్) హాస్టల్‌లో తమిళనాడుకు చెందిన ఓ మహిళా టెక్కీ(20) ఉంటోంది.
ఈమె నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 26న రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కు చేరుకుంది. అర్ధరాత్రి సమయంలో హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు ఆ యువతి ఉన్న గదిలోకి ప్రవేశించాడు. నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని బెదిరించాడు. తన వద్ద అలాంటివి ఏవీ లేవని చెప్పడంతో కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడి ఉడాయించాడు. ఘటనపై బాధితురాలు మూడు రోజుల క్రితం పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కోసం గాలిస్తున్నారు.