నగరంలో ముష్కరులు నరమేథం సృష్టించి మంగళవారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులను గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు.
సాక్షి, ముంబై: నగరంలో ముష్కరులు నరమేథం సృష్టించి మంగళవారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులను గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. వీరి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 166 మంది భారతీయులు, విదేశీయులను ముంబైకర్లు స్మరించుకున్నారు. వీరి స్మృత్యర్థం మెరైన్‌లైన్స్‌లోని పోలీసు జింఖానాలో నిర్మించిన అమరవీరుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, కేంద్ర మానవ వనరుల సహాయ శాఖ మంత్రి శశిథరూర్ పుష్పాగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు, నగర పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్, పోలీసులు కూడా అమరులను గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కొనే క్రమంలో వీర మరణం పొందిన జవాన్‌లు, పోలీసు అధికారులను స్మరించుకున్నారు. మారణహోమం సృష్టించిన తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు, జాతీయ భద్రతా దళం సేవలను ప్రశంసించారు. ఆ తర్వాత భారీ సంఖ్యలో హాజరైన బాధిత కుటుంబసభ్యులు తమవారిని తలచుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇలాంటి సంస్మరణ కార్యక్రమాలను తాజ్ మహల్ ప్యాలెస్, టవర్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్‌లు, లియోపోల్డ్ కేఫ్, నారీమన్ హౌస్‌లోనూ నిర్వహించారు. 2008, నవంబర్ 26 నుంచి 29 వరకు ఉగ్రవాదులు వీటిని లక్ష్యంగా ఎంచుకొని అనేక మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఉగ్రవాదులు మొదటగా లక్ష్యంగా ఎంచుకున్న ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో అమరులకు నివాళులర్పించేందుకు రైల్వే అధికారులు ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. ‘జీవితం ముందుకు సాగుతోంది. అప్పటి భయంకర రోజులను మళ్లీ ప్రజలకు గుర్తు చేయలేమ’ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆ రోజు రాత్రి జరిగిన భయంకర దృశ్యాలను మరిచిపోయానని లియోపొల్ట్ కేఫ్‌లో జరిగిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ భరత్ గుజ్జర్ అన్నారు. ఆ విషాద ఘటన గురించి ఆలోచిస్తూ, ఆ జ్ఞాపకాలతో ఎన్ని రోజులు బతకాలన్నారు. ఉగ్రవాది కసబ్‌ను పట్టుకునేందుకు సహచరులకు సహకరించే సమయంలో చౌపాటి బీచ్ సమీపంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి బాలసాహెబ్ భోన్సలే కుమారుడు సచిన్ భోన్సలే మాట్లాడుతూ ఆ రోజు జ్ఞాపకాలు ఇప్పటికీ తమ కుటుంబసభ్యులు గుర్తు చేస్తుంటారని అన్నారు. ‘ప్రతి బుధవారం, గురువారం వచ్చిందంటే అమ్మ కలవరపడుతుంది. బుధవారం విధుల కోసం బయటకు వెళ్లిన నాన్న బాలసాహెబ్ లేరన్న విషయం మరుసటి రోజు తెలిసింద’ని విచారం వ్యక్తం చేశారు. సోదరుడు ముంబై పోలీసు శాఖలో, తాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని వివరించాడు. శాంతి పరిఢవిల్లాలని కాంక్షిస్తూ సోమవారం వందలాది మంది అంతర్జాతీయ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
షోలాపూర్‌లో...
షోలాపూర్, న్యూస్‌లైన్: 26/11 దాడుల్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో అమరులైన వీర జవాన్‌లకు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో మంగళవారం నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అల్కారాటోడ్, కార్పొరేషన్ కమిషనర్ చంద్రకాంత్ గూడెం వార్, పోలీసు కమిషనర్ ప్రదీప్ రాసుకర్ తదితరులు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.