ఆ భూమి నాకొద్దు కేంద్ర మంత్రి శుక్లా ప్రకటన
Published Wed, Dec 11 2013 12:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి రాజీవ్‌శుక్లా జుహూలో చౌకధరకు భూమిని కేటాయించిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడం, ఆక్రమణల కారణంగా భూమిని స్వాధీనం చేసుకోకూడదని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తాము ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ నెల నాలుగున లేఖ రాశానని శుక్లా మంగళవారం ఇక్కడ తెలిపారు. తనకు సంబంధించిన సొసైటీకి కేటాయించిన స్థలంలో ఆక్రమణల కారణంగా ఎటువంటి కార్యకలాపాలూ చేపట్టనందున వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సదరు స్థలంలో పలు మురికివాడలు వెలిసినందున దానిని తాము స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నో విద్యాసంస్థలకు తక్కువ ధరలకు భూములు కేటాయించారని, తనకూ ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి మాత్రమే ఆ స్థలం కోరామని, వాణిజ్య కార్యకలాపాల ఆలోచనే లేదని రాజీవ్ శుక్లా తెలియజేశారు. శుక్లాకు భూకేటాయింపులపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మంత్రికి కారుచౌకగా రెండు ప్లాట్లను కట్టబెట్టారని ఆ పార్టీ సీనియర్ నేత కిరీట్‌సోమయ్య ముంబైలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అయితే ఈ భూమి ఎక్కడుందో రెవెన్యూ అధికారులు కనుక్కోలేకపోయారని తెలిపారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ భూమిని కేటాయించారని వివరించారు.
Advertisement
Advertisement