సాక్షి, ముంబై: పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. ఈ పనులు ఐదేళ్లలో పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది, దీని కారణంగా స్థలాలు కోల్పోనున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించే అంశాన్ని శిశిర్ షిండే, బాలా నంద్‌గావ్కర్ తదితర ఎమ్మెల్యేలు లేవనెత్తారు. దీనిపై చవాన్ పైవిధంగా సమాధానమిచ్చారు. మెట్రో ప్రాజెక్టు రూ.10,183 కోట్ల వ్యయంతో కూడుకున్నదని అన్నారు. దీన్ని పింప్రి నుంచి స్వార్‌గేట్ వరకు, వనాజ్ నుంచి రామ్‌వాడి వరకు నిర్మించనున్నారన్నారు.
ఈ పనులకయ్యే వ్యయం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వాటా 20 శాతం చొప్పున ఉంటుందని స్పష్టం చేశారు. పుణే, పింప్రి-చించ్‌వడ్ కార్పొరేషన్‌ల వాటా 10 శాతం చొప్పున ఉంటుంది. అంతేకాకుండా వనాజ్ నుంచి రామ్‌వాడి మార్గం పనుల్లో పుణే కార్పొరేషన్ 10 శాతం వ్యయాన్ని భరించనుందని చవాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వచ్చే ఏడాది ప్రత్యక్షంగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2019 వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు కోసం ప్రైవేటు స్థలాలను సేకరిస్తామని, ప్రతిఫలంగా బాధితులకు ప్రభుత్వ నియమాల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.