Pune Metro rail works
-
ప్రజారవాణాపై ఫోకస్: మోదీ
పుణే: నగరాలు, పట్టణాల్లో మెట్రో రైలు అనుసంధానంతో సహా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మహారాష్ట్రలోని పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. గర్వారే స్టేషన్లో రైలుకు పంచ్చజెండా ఊపారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంఐటీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్టుకు తానే పునాది రాయి వేసి, ఇప్పుడు తన చేతుల మీదుగానే ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేయడం మినహా అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలిసేది కాదని పేర్కొన్నారు. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయొచ్చన్న సందేశం ఈ మెట్రో రైలు ప్రాజెక్టుతో ప్రజల్లోకి వెళ్లిందని వివరించారు. పనుల్లో జాప్యం జరిగితే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. మెట్రో రైళ్లలో విరివిగా ప్రయాణించాలని కోరారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని, 2030 నాటికి దేశ జనాభాలో 60 కోట్ల మంది నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తారని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా నగరాలు, పట్టణాల్లో రోడ్లను వెడల్పు చేయడం, ఫ్లైఓవర్లు నిర్మించడం కష్టం కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఆధునిక యుగంలో మెట్రో రైలు అనుసంధానం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి రావడం లేదా నిర్మాణంలో ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రధాని మోదీ స్వయంగా టికెట్ కొనుక్కొని పుణే మెట్రో రైలులో గర్వారే నుంచి ఆనంద్‌నగర్ స్టేషన్ వరకు దాదాపు 10 నిమిషాలపాటు ప్రయాణించారు. రైలులో తనతో పాటు ప్రయాణిస్తున్న దివ్యాంగ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. పుణేలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. రూ.11,400 కోట్లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 32.2 కిలోమీటర్లకు గాను నిర్మాణం పూర్తయిన 12 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. చదవండి: పెద్ద దేశాలకే ఇబ్బంది.. భారతీయుల తరలింపుపై మోదీ కీలక వ్యాఖ్యలు Ensuring convenient and comfortable travel for the people of Pune. PM @narendramodi inaugurated the Pune Metro and travelled on board with his young friends. pic.twitter.com/154a2mJk8f — PMO India (@PMOIndia) March 6, 2022 -
పుణే: మెట్రో రైళ్లలో సైకిళ్లు తీసుకెళ్లొచ్చు
పింప్రి(మహారాష్ట్ర): పుణే మెట్రోలో ప్రయాణించేవారు ఇకపై తమ వెంట సైకిళ్లను కూడా తీసుకువెళ్లవచ్చని మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ వెల్లడించారు. దీంతో మెట్రో రైలులో ప్రయాణించిన తరువాత ఆటోలు, బస్సుల కోసం వేచిచూడాల్సిన అవసరముండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎంతోమందికి మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. సైకిళ్ల కారణంగా పర్యావరణానికి హాని జరగకపోవడమే గాక రోడ్లపై ట్రాఫిక్ కూడా తగ్గుందని వివరించారు. (చదవండి: ప్యాసింజర్ రైళ్ల వల్లే నష్టాలు.. ఇదేం చోద్యం?) సాధారణంగా ప్రజలు మెట్రో స్టేషన్‌కు రావాలన్నా, ఇక్కడి నుంచి వేరేచోటికి వెళ్లాలన్నా ఆటోలు, బస్సులను ఆశ్రయిస్తారు. దీని కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ పెరగడంతో పాటు ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అలాంటి వారు తమ వెంట సైకిల్ తెచ్చుకుంటే మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలన్నా, రైలు దిగిన తరువాత తమ గమ్యస్థానాలకు వెళ్లాలన్నా సైకిళ్లు ఎంతో దోహద పడతాయని బ్రిజేష్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. -
వచ్చే ఏడాది పుణే మెట్రో పనులు
సాక్షి, ముంబై: పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. ఈ పనులు ఐదేళ్లలో పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది, దీని కారణంగా స్థలాలు కోల్పోనున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించే అంశాన్ని శిశిర్ షిండే, బాలా నంద్గావ్కర్ తదితర ఎమ్మెల్యేలు లేవనెత్తారు. దీనిపై చవాన్ పైవిధంగా సమాధానమిచ్చారు. మెట్రో ప్రాజెక్టు రూ.10,183 కోట్ల వ్యయంతో కూడుకున్నదని అన్నారు. దీన్ని పింప్రి నుంచి స్వార్గేట్ వరకు, వనాజ్ నుంచి రామ్వాడి వరకు నిర్మించనున్నారన్నారు. ఈ పనులకయ్యే వ్యయం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వాటా 20 శాతం చొప్పున ఉంటుందని స్పష్టం చేశారు. పుణే, పింప్రి-చించ్వడ్ కార్పొరేషన్ల వాటా 10 శాతం చొప్పున ఉంటుంది. అంతేకాకుండా వనాజ్ నుంచి రామ్వాడి మార్గం పనుల్లో పుణే కార్పొరేషన్ 10 శాతం వ్యయాన్ని భరించనుందని చవాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వచ్చే ఏడాది ప్రత్యక్షంగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2019 వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు కోసం ప్రైవేటు స్థలాలను సేకరిస్తామని, ప్రతిఫలంగా బాధితులకు ప్రభుత్వ నియమాల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.