ఖాకీల కక్కుర్తి.. సీసీటీవీలో బుక్కు
చెన్నై: తమిళనాడులో ముగ్గురు కానిస్టేబుళ్లు కక్కుర్తి పడ్డారు. ఓ కూలీ చేసుకొని బతికే వ్యక్తి దగ్గర దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే అతడిపై దొంగతనం కేసు పెడతామంటూ హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసులు ఆ ముగ్గురుని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. జే ఇరుదయరాజ్, జే అరుల్‌దాస్, ఎస్ రామకృష్ణ అనే ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రత్యేక విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ముగ్గురు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్‌పై పడుకున్న ఓ కూలీ దగ్గరకు వెళ్లారు. కూలీ నాలి చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్న అతడు ఉదయాన్నే కేరళకు రైలెక్కాల్సి ఉంది.
అయితే, అతడిని బెదిరించిన ఆ ముగ్గురు అతడి దగ్గర నుంచి పర్సు(అందులో రూ.1800 ఉన్నాయి), రూ.16వేల విలువైన సెల్‌ఫోన్, అతడి వాచ్ తీసుకున్నారు. అయితే, కనీసం తను ఊరెళ్లెందుకు ఒక రూ.300 ఇవ్వాలని బతిమిలాడుకోవడంతో ఇచ్చి వెళ్లిపోయారు. అయితే, ఈ విషయం అతడు పోలీసులకు చెప్పడంతో వారు విచారణ ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. అలాగే, అక్కడే ఉన్న కొంతమంది రిక్షా కార్మికుల వద్ద వివరాలు తెలుసుకొని ఆ ముగ్గురు కానిస్టేబుల్స్‌ను అరెస్టు చేశారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షపడనుంది.