ఒంగోలులో నోట్ల మార్పిడితో ఘరానా మోసం!
ఒంగోలు : నోట్ల మార్పిడి చేస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఒంగోలు ట్రంక్రోడ్డులోని శర్వణా ఫ్యాన్సీ స్టోర్స్‌లో ఈ ఘటన శనివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే...ఫ్యాన్సీ షాపు యజమాని శ్రీనివాస్రావు మధ‍్యవర్తిగా వ్యవహారిస్తూ నోట్ల మార్పిడి దందాను నడిపిస్తున్నాడు. అందులో భాగంగా రూ.25 లక్షల కొత్త కరెన్సీకి రూ.29 లక్షలు పాత కరెన్సీ ఇప్పించేందుకు ఒప్పందం కుదిర్చాడు. దీంతో నాలుగు లక్షలు వస్తాయన్న ఆశతో కనిగిరికి చెందిన శేషగిరి అనే వ్యక్తి రూ.25 లక్షల కొత్త కరెన్సీని ఫ్యాన్సీ షాపు యాజమాని శ్రీనివాసరావుకు ఇచ్చాడు. అనంతరం రూ.29 లక్షలు ఇస్తానన్న శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగ్లో పాత నోట్లు ఉన్నాయంటూ బ్యాగ్ ఇచ్చి కారులో ఉడాయించాడు.
కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ తెరిచి చూస్తే అందులో న్యూస్ పేపర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న శేషగిరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి అంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందనే అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం శేషగిరి, మధ్యవర్తి శ్రీనివాసరావుని పోలీసులు విచారిస్తున్నారు. పరారైన శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.