రీపోలింగ్‌లో 48.94 శాతం ఓటింగ్ | 48.94 percent voting in re-polling | Sakshi
Sakshi News home page

రీపోలింగ్‌లో 48.94 శాతం ఓటింగ్

Published Mon, Apr 28 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

48.94 percent voting in re-polling

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని మూడు లోక్‌సభ స్థానాల్లోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం జరిగిన రీపోలింగ్‌లో సరాసరి 48.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం సెలవు రోజైనా ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. గత గురువారం (తుది దశ) రోజున నమోదైన పోలింగ్ శాతం కంటే ఆదివారం మరింత తగ్గడం ఇటు ఈసీ అధికారులతో పాటు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ మలాడ్‌లోని పోలింగ్ కేంద్రం నంబర్ 242, చార్‌కోప్‌లోని పోలింగ్ కేంద్రం నంబర్ 243, చాందివలిలోని పోలింగ్ బూత్ నంబర్ 160, అహ్మద్‌నగర్‌లోని శ్రీగోండ పోలింగ్ కేంద్రం నంబర్ 305లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

 ముంబైలోని మూడు పోలింగ్ కేంద్రాలలో 2,517 మంది ఓటర్లుండగా, కేవలం 1,232 మంది ఓటేశారు. వీరిలో 668 మంది పురుషులు, 564 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మూడు పోలింగ్ కేంద్రాల్లో గత గురువారం జరిగిన పోలింగ్‌లో సరాసరి 62.13 శాతం నమోదైంది. అయితే ఆదివారం జరిగిన రీపోలింగ్‌లో 48.94 శాతం న మోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 1,154 మంది ఓటర్లున్న శ్రీగోండాలో పోలింగ్ బూత్‌లో  735 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 63.77 శాతం నమోదైంది.

 పోలింగ్ శాతం తేడాలతో అభ్యర్థుల్లో ఆయోమయం
 ఠాణే: పోలింగ్ రోజున ప్రకటించిన ఓటింగ్ శాతం, అంకెలు...తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కలకు భారీగా వ్యత్యాసం ఉండటం అభ్యర్థుల్లో ఆయోమయాన్ని సృష్టిస్తోంది. ఈ నెల 24న అన్ని నియోజకవర్గాల్లో 49.48 పోలింగ్ శాతం నమోదైందని ఈసీ ప్రకటించింది. పాల్ఘర్‌లో 60 శాతం, భివండీలో 45 శాతం, కళ్యాణ్‌లో 41 శాతం, ఠాణేలో 53 పోలింగ్ శాతమని తెలిపింది. 72,68,061 మంది ఓటర్లు ఉండగా, 35,96,237 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రకటించింది. అయితే తాజాగా ఈసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో 51.71 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొంది. పాల్ఘర్‌లో 63.49, భివండీలో 51.62, కళ్యాణ్‌లో 43.06 పోలింగ్ శాతం నమోదైందని వెల్లడించింది. పోలింగ్ శాతంలో పెరుగుదల  అర్ధం చేసుకోవచ్చని, అయితే కొన్ని స్థానాల్లో తగ్గడం మాత్రం తీవ్రంగా పరిగణించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఠాణేలోమాత్రం 44.757 ఓట్లు తగ్గడం పోటీల్లో ఉన్న నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.

 ‘ఠాణే పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలి’
 ఠాణే: నగరంలోని మజివాడ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్‌సీపీ డిమాండ్ చేసింది. ఇక్కడ మొత్తం 1300 మంది ఓటర్లుంటే కేవలం ఐదుగురిని మత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిచ్చారని పోలింగ్ ఏజెంట్, ఎన్సీపీ కార్యకర్త ఆశోక్ పోహేకర్ అన్నారు. మిగతావారి పేర్లు ఓటరు జాబితాలో కనిపించలేదని తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాలు 338(ఏ), 341 (ఏ) కలపడం వల్ల ఓటర్ల జాబితాలో కొందరి పేర్లను తొలగించారని వివరించారు. అనేక మంది ఓటు వేసేందుకు దూరమయ్యారని, అందువల్ల ఇక్కడ రీపోలింగ్ కచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement