నకిలీ రేషన్ కార్డుల పై బార్‌కోడ్ కొరడా! | 54 lakh ‘ineligible’ ration cards in Maharashtra, says Food and Civil Supplies Minister | Sakshi
Sakshi News home page

నకిలీ రేషన్ కార్డుల పై బార్‌కోడ్ కొరడా!

Published Thu, Dec 12 2013 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

నకిలీ రేషన్ కార్డుల పై బార్‌కోడ్ కొరడా!

నకిలీ రేషన్ కార్డుల పై బార్‌కోడ్ కొరడా!

సాక్షి, ముంబై: నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘బార్‌కోడ్ రేషన్ కార్డులు’ జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అసెంబ్లీలో ప్రకటించారు. నకిలీ రేషన్ కార్డుల అంశాన్ని  ఎమ్మెల్యేలు అశోక్ పవార్, రమేశ్‌రావ్ థోరత్, బాలానంద్‌గావ్కర్, విజయ్ శివతారే  లేవనెత్తారు. దీనిపై అనిల్ దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... రాష్ట్రంలో 54,06,867 నకిలీ రేషన్ కార్డులున్నాయన్నారు. వీటిని జారీ చేయడంలో, గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 252 మంది రేషనింగ్ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మరో 62 మందిపై చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కొందరు అధికారులు బంగ్లాదేశీయులకు కూడా రేషన్ కార్డులు అందజేశారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 
 ఇదిలాఉండగా నకిలీ రేషన్ కార్డుదారులకు ఎంత మేర ధాన్యం పంపిణీ జరిగిందని ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే ప్రశ్నించారు. దీనిపై దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... 2005-2013 వరకు నకిలీ రేషన్ కార్డులను ఏరివేసే కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఇందులో పట్టుబడిన వేలాది నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ నకిలీ కార్డుల ద్వారా ఎంతమేర ధాన్యం అర్హులకు అందకుండాపోయిందనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బంగ్లాదేశీయులకు రేషన్ కార్డులు జారీచేయడాన్ని పూర్తిగా నిలిపివే శామని, ప్రస్తుతం బార్‌కోడ్ విదానాన్ని అమలుచేసే ప్రక్రియ ప్రారంభమైందని, పనులు దాదాపు 90 శాతం పూర్తికావచ్చాయని సభకు తెలిపారు. ఈ బార్‌కోడ్ ఆధారంగా నకిలీ రేషన్ ఏదైనా ఉంటే వెంటనే గుర్తించే అవకాశముంటుందని చెప్పారు. రద్దుచేసిన రేషన్‌కార్డులపై విభాగ స్థాయిలో విచారణ ప్రారంభించామని, తుది నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఆహార భద్రత పథకం ఈ నెలాఖరు వరకు అమలవుతుందని, నిజమైన లబ్ధిదారులకు ఇదెంతో ఉపయోగపడనుందన్నారు.
 
 విద్యుత్ చార్జీలను తగ్గిస్తాం: అజిత్‌పవార్
 రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న అన్ని విద్యుదుత్పత్తి కంపెనీల చార్జీలు తగ్గిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి అజిత్‌పవార్ బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం రాణే కమిటి నియమించిందని, ఈ కమిటీ  నుంచి నివేదిక రాగానే చార్జీలు తగ్గిస్తామన్నారు. ఇదే అంశంపై చర్చించాలని ప్రతిపక్ష నాయకులు మంగళవారం పట్టుబట్టారు. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. ప్రతిపక్ష నాయకులు శాంతించకపోవడంతో చివరకు సభను బుధవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే మళ్లీ ఇదే అంశం చర్చకు వచ్చింది. దీనిపై పవార్ పై విధంగా స్పంధించారు.  
 
 సచిన్, సీఎన్‌ఆర్‌కు సభ శుభాకాంక్షలు..
 దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు ఎంపికైన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావుకు రాష్ట్ర అసెంబ్లీ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ విషయమై సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
 
 ఈ తీర్మానాన్ని ఆమోదించిన సభలోని సభ్యులందరూ పార్టీలకతీతంగా బల్లలను తరిచి సచిన్, రావుకు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ రాష్ట్రానికేకాక యావత్ దేశానికి పేరు తెచ్చారని, ఆయన అద్భుత ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నమోదు చేసిందని పలువురు సభికులు ఈ సందర్భంగా కొనియాడారు. సచిన్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు సముచితమైన గౌరవాన్ని కల్పించిందని చవాన్ పేర్కొన్నారు. రావుకు కొల్హాపూర్‌తో దగ్గరి సంబంధాలున్నాయని, ఆయనకు మరాఠీ కూడా మాట్లాడడం వచ్చని, మరాఠీ నాటకాలంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే, శివసేన నేత సుభాష్ దేశాయ్, ఎమ్మెన్నెస్ నేత బాలానంద గావ్కర్ తదితరులు సచిన్, రావులను ప్రశంసల్లో ముంచెత్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement