fake ration card
-
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ: ప్రజలు దేశంలో ఎక్కడ్నుంచి అయినా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు(వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్) విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు 2020, జూన్ 30 వరకూ గడువిస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్తాన్ రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకునే సదుపాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ‘2020, జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మేం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాశాం. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే నిరుపేదలు రేషన్ సరుకులు పొందలేక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడుతుంది. మా ప్రభుత్వం తొలి 100 రోజులు ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాం’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. రేషన్ కోసం ఆధార్ చూపాల్సిందే.. ఈ నూతన విధానంలో ఓ రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రేషన్ సరుకుల కోసం ఆధార్‌కార్డును చూపాల్సి ఉంటుందని పాశ్వాన్ తెలిపారు. తమ పేర్లు రిజస్టరైన రేషన్‌షాపుల్లో అయితే కేవలం రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు. ఓ రాష్ట్రంలో ఆహారపదార్థాలను ఉచితంగా అందుకునే వ్యక్తి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు మాత్రం రూ.1 నుంచి రూ.3 వరకు కనీసధరను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ‘రేషన్‌కార్డుదారుల్లో 89 శాతం మంది ఆధార్‌తో అనుసంధానమయ్యారు. దేశవ్యాప్తంగా 77 శాతం రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) యంత్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో 100 శాతం పీవోఎస్ యంత్రాలను అమర్చారు. కాబట్టి కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందిలేదు’ అని పేర్కొన్నారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పాశ్వాన్ చెప్పారు. కుటుంబంలో ఒకరు మరో రాష్ట్రానికి వలసవెళ్లి మొత్తం రేషన్ సరుకులు అక్కడే కొనేయకుండా 50 శాతం గరిష్ట పరిమితి విధిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పాశ్వాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 80 కోట్ల మందికి రేషన్‌షాపుల్లో తక్కువ ధరలకే ఆహారపదార్థాలను అందజేస్తోంది. -
నకిలీ కార్డుల సమాచారమిస్తే నజరానా
నవంబర్ నుంచి అమల్లోకి పౌరకార్మికులందరికీ బీపీఎల్ కార్డులు ఏపీఎల్ కార్డుదారులకు సబ్సిడీ బియ్యం లేదు మంత్రి దినేష్ గుండూరావు సాక్షి, బెంగళూరు : నకిలీ రేషన్ కార్డుల సమాచారం అందించిన వారికి నగదు బహుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావు వెల్లడించారు. నవంబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. నకిలీ కార్డుల ఏరివేత ప్రక్రియను సక్రమంగా అమలు చేయడం కోసమే ‘నజరానా’ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. పౌరకార్మికులందరిరీ బీపీఎల్ కార్డులను అందిం చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఏపీఎల్ కార్డుదారులకు సబ్సిడీ ధరపై బియ్యం అందించే విషయమేదీ ప్రస్తుతానికి పరిశీలనలో లేదన్నారు. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల మాదిరి ఇక్కడ కూడా సబ్సిడీ ధరల్లో ఆహారం అందించే క్యాటీన్లను తెరవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు లేఖ రాసినా అటు వైపు నుంచి సమాచారం రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘క్యాంటీన్ల’కంటే అంత్యోదయ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలుచేయడం వల్లే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
నకిలీ రేషన్ కార్డుల పై బార్కోడ్ కొరడా!
సాక్షి, ముంబై: నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘బార్కోడ్ రేషన్ కార్డులు’ జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అసెంబ్లీలో ప్రకటించారు. నకిలీ రేషన్ కార్డుల అంశాన్ని ఎమ్మెల్యేలు అశోక్ పవార్, రమేశ్‌రావ్ థోరత్, బాలానంద్‌గావ్కర్, విజయ్ శివతారే లేవనెత్తారు. దీనిపై అనిల్ దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... రాష్ట్రంలో 54,06,867 నకిలీ రేషన్ కార్డులున్నాయన్నారు. వీటిని జారీ చేయడంలో, గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 252 మంది రేషనింగ్ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మరో 62 మందిపై చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కొందరు అధికారులు బంగ్లాదేశీయులకు కూడా రేషన్ కార్డులు అందజేశారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలాఉండగా నకిలీ రేషన్ కార్డుదారులకు ఎంత మేర ధాన్యం పంపిణీ జరిగిందని ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ప్రశ్నించారు. దీనిపై దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... 2005-2013 వరకు నకిలీ రేషన్ కార్డులను ఏరివేసే కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఇందులో పట్టుబడిన వేలాది నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ నకిలీ కార్డుల ద్వారా ఎంతమేర ధాన్యం అర్హులకు అందకుండాపోయిందనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బంగ్లాదేశీయులకు రేషన్ కార్డులు జారీచేయడాన్ని పూర్తిగా నిలిపివే శామని, ప్రస్తుతం బార్కోడ్ విదానాన్ని అమలుచేసే ప్రక్రియ ప్రారంభమైందని, పనులు దాదాపు 90 శాతం పూర్తికావచ్చాయని సభకు తెలిపారు. ఈ బార్కోడ్ ఆధారంగా నకిలీ రేషన్ ఏదైనా ఉంటే వెంటనే గుర్తించే అవకాశముంటుందని చెప్పారు. రద్దుచేసిన రేషన్‌కార్డులపై విభాగ స్థాయిలో విచారణ ప్రారంభించామని, తుది నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఆహార భద్రత పథకం ఈ నెలాఖరు వరకు అమలవుతుందని, నిజమైన లబ్ధిదారులకు ఇదెంతో ఉపయోగపడనుందన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గిస్తాం: అజిత్‌పవార్ రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న అన్ని విద్యుదుత్పత్తి కంపెనీల చార్జీలు తగ్గిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి అజిత్‌పవార్ బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం రాణే కమిటి నియమించిందని, ఈ కమిటీ నుంచి నివేదిక రాగానే చార్జీలు తగ్గిస్తామన్నారు. ఇదే అంశంపై చర్చించాలని ప్రతిపక్ష నాయకులు మంగళవారం పట్టుబట్టారు. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. ప్రతిపక్ష నాయకులు శాంతించకపోవడంతో చివరకు సభను బుధవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే మళ్లీ ఇదే అంశం చర్చకు వచ్చింది. దీనిపై పవార్ పై విధంగా స్పంధించారు. సచిన్, సీఎన్ఆర్కు సభ శుభాకాంక్షలు.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు ఎంపికైన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావుకు రాష్ట్ర అసెంబ్లీ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ విషయమై సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన సభలోని సభ్యులందరూ పార్టీలకతీతంగా బల్లలను తరిచి సచిన్, రావుకు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ రాష్ట్రానికేకాక యావత్ దేశానికి పేరు తెచ్చారని, ఆయన అద్భుత ప్రదర్శన ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను నమోదు చేసిందని పలువురు సభికులు ఈ సందర్భంగా కొనియాడారు. సచిన్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు సముచితమైన గౌరవాన్ని కల్పించిందని చవాన్ పేర్కొన్నారు. రావుకు కొల్హాపూర్‌తో దగ్గరి సంబంధాలున్నాయని, ఆయనకు మరాఠీ కూడా మాట్లాడడం వచ్చని, మరాఠీ నాటకాలంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, శివసేన నేత సుభాష్ దేశాయ్, ఎమ్మెన్నెస్ నేత బాలానంద గావ్కర్ తదితరులు సచిన్, రావులను ప్రశంసల్లో ముంచెత్తారు.