58 ఇసుక లారీలు సీజ్
Published Sat, Oct 8 2016 6:38 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
- డ్రైవర్లపై కేసు నమోదు, అరెస్ట్
దాచేపల్లి : ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్న లారీలను పోలీసులు శనివారం సీజ్ చేశారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి సముద్రపు ఇసుకలో కృష్ణానది ఇసుకను కలిపి ఇతర రాష్ట్రానికి తరలిస్తున్న 58 లారీలను గుర్తించి సీజ్ చేసి 58 మంది లారీడ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాచేపల్లి ఎస్సై కట్టా ఆనంద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి సముద్రపు ఇసుకను లారీల్లో లోడు చేసుకుని తెలంగాణకు తరలిస్తున్నారు. దాచేపల్లి మండలం పొందుగల పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద లారీలను ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీ చేసిన లారీల్లో ఇసుక రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు సక్రమంగా లేకపోవటం, లీజుదారు పేరు, హైదరాబాద్‌లోని ఇసుక చేరాల్సిన అడ్రసు ఒకేలా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కొన్ని లారీల్లో ఓవర్‌లోడ్ కూడా ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. సముద్రపు ఇసుకలో కృష్ణానది ఇసుకను కూడా కలిపినట్లు తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. దీంతో 58 లారీలను సీజ్ చేసి నడికుడి సబ్ మార్కెట్ యార్డుకు తరలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 58 మంది లారీ డ్రైవర్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి గురజాల కోర్టులో హాజరుపరిచామని ఎస్సై ఆనంద్ వెల్లడించారు.
Advertisement
Advertisement