
అమరావతిలో భారీ భూకబ్జా ప్రయత్నం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ భూకబ్జాకు ప్రయత్నం జరుగుతోంది. ఉద్ధండరాయునిపాలెంలోని పెద్దలంకలో 75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారు. 50 ఎకరాల భూమిలో రాత్రికి రాత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మరో 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు గుంతులు తవ్వారు.
కబ్జాదారులు తమను బెదిరించి ఇక్కడ మొక్కలు నాటారని స్థానికులు తెలిపారు. భూకబ్జాను అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే కబ్జాదారులు ఎవరనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఈ వ్యవహారాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.