వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
బం«ధువుల ఆరోపణ
కేకేనగర్ : కడలూరు జిల్లాలో ప్రభుత్వ ఆçస్పత్రిలో అబార్షన్ చేయించుకున్న గర్భిణి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిని ముట్టడించి ఆందోళన చేశారు. కడలూరు జిల్లా బన్రుట్టి సమీపంలోని ఆండిపాళయంకు చెందిన ధనసెలియన్ కూలీ కార్మికుడు.
ఇతని భార్య కళైవాణి(27). వీరికి ఇద్దరు పిల్లలు. ఈ స్థితిలో కలైవాణి మళ్లీ గర్భం దాల్చింది. ఆర్థిక స్తోమత కారణంగా భర్త సూచన మేరకు అబార్షన్‌కు కళైవాణి ఒప్పుకుంది. ఆమెను అబార్షన్ కోసం కడలూరు ప్రభుత్వ ఆçస్పత్రిలో శుక్రవారం చేర్పించారు. వైద్యులు అబార్షన్ చేశారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కళైవాణి అధిక రక్తస్రావం ఏర్పడడంతో మృతి చెందింది. సమాచారం అందుకుని కళైవాణి భర్త, ఆమె బంధువులు కడలూర్ ప్రభుత్వ ఆస్పత్రి ముందు గుమిగూడారు.
ఆమె మృతదేహాన్ని తీసుకోకుండా ఆందోళనకు దిగారు. పుదునగర్ పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. విచారణలో కళైవాణికి శుక్రవారం అబార్షన్ చేశారని, అప్పటి నుంచి ఆమె కళ్లు తెరవకుండా అలాగే ఉందని, ఈ క్రమంలో సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. కళైవాణి మృతిపట్ల తమకు అనుమానం ఉందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందిందని వారు ఆరోపించారు. ఆమెకు చికిత్స చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, నష్ట పరిహారం చెల్లించే వరకు తాము ఆందోళన విరమించేదిలేదని వారు తేల్చిచెప్పారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనాన్ని కలిగించింది.