సాక్షి, న్యూఢిల్లీ: ఈ రిక్షాలను మోటారు వాహన చట్టం కిందకు తెచ్చి వాటిని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. మోటారు వాహన చట్టం ( సవరణ ) బిల్లు- 2014 ఈ రిక్షాలు, ఈ కార్టులకు చట్టబద్ధత కల్పించడంతో పాటు వాటి చోదకులకు డ్రైవింగ్‌లెసైన్స్ నియమాలను సడలించేందుకు వీలు కల్పించింది. ఈ రిక్షాలను వాటి యజమానులే నడపాలని, అద్దెకు ఇవ్వరాదని కూడా బిల్లు పేర్కొంది. ఈ సవరణ బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ రిక్షాలు, ఈ కార్టుల ప్రమాణాలకు సంబంధించిన నియమాలను రూపొందించడంతో పాటు వాటి చోదకులకు డ్రైవింగ్ లెసైన్సులు ఇచ్చే తీరును, షరతులను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. ఈ మోటారు వాహన చట్టం -1988 ను సవరిస్తూ మోటారు వాహన చట్టం సవరణ -2104 పేరుతో రవాణా మంత్రిత్వశాఖ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఈ రిక్షా యజమానులు ఈ రిక్షా మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ వద్ద పది రోజులు శిక్షణ తీసుకుని వాటిని నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం డ్రైవర్లు కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలన్న నియమాన్ని కూడా సవరించారు.
డ్రైవరు కాకుండా నలుగురుకు మించి వ్యక్తులు ఈ రిక్షాలో ప్రయాణించరాదని బిల్లు పేర్కొంది. ఈ రిక్షాలో 40 కిలోలు, ఈ కార్టులో 310 కిలోలకు మించిన బరువు సామాను తీసుకువెళ్లరాదని, వాటి వేగం గంటకు 25 కిమీలకు మించరాదని కూడా బిల్లు పేర్కొంది. ఈ బిల్లుపై సభలో జరిగిన చర్చకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ ఈ చట్టం రూపొందడం వల్ల పర్యావరణానికి మేలు కలగడంతో పాటు పేదలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. దేశంలో దాదాపు కోటి మంది ఈ రిక్షా, ఈ కార్టు చోదకులు ఉన్నారని ఆయన చెప్పారు. రిక్షాచోదకులకు శారీరక శ్రమ నుంచి వముక్తి కలిగించి వారు ఈ రిక్షాలు, ఈ కార్టు నడిపేలా చేయాలని ఆయన చెప్పారు. స్టాండింగ్ కమిటీ ముందుంచిన తర్వాత బిల్లును పార్లమెంటు ఆమోదం కోసం సమర్పిస్తే బాగుండేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. తాము పేదలకు వ్యతిరేకం కాదని కాదని, కానీ బీజేపీ సర్కారు సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు.
ఈ పార్లమెంటు సమావేశాల్లో చాలా బిల్లులను స్టాండింగ్ కమిటీకి సమర్పించ లేదని, ఢిల్లీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రభుత్వం ఈ రిక్షా బిల్లును తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, చర్చలో కాంగ్రెస్‌కు చెందిన రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. ఈ రిక్షాల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో నడవనిస్తారా అని ప్రశ్నించారు. అప్నాదళ్‌కు చెందిన అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. ఈ రిక్షాలు పర్యావరణానికి సన్నిహితమైనవి, పేదలకు అనువైనవని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రిక్షా బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రతిపక్షం చేసిన ఆరోపణలను మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు.ప్రభుత్వం ఇదివరకే మార్గదర్శకాలను రూపొందించిందని, కానీ ఈ రిక్షాలను మోటారు వాహన చట్టం కిందకు తేవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం వల్ల బిల్లు తేవాల్సివచ్చిందని ఆయన చెప్పారు.
ఈ-రిక్షాలకు మార్గం సుగమం..
Published Fri, Dec 19 2014 12:31 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement