న్యూఢిల్లీ: ఈ-రిక్షాలకు సంబంధించి నూతన నియమనిబంధనలతోకూడిన తుది నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వచ్చేవారం విడుదల చేయనుంది. ఇందులో గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ: డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరివంటి నిబంధనలను పొందుపరచనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. న్యూ సెంట్రల్ వెహికల్ రూల్స్-2014 పేరిట దీనిని విడుదల చేస్తుందన్నారు. దసరా సెలవుల తర్వాత కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశముందన్నారు. కాగా నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగ తి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషేధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది.
హస్తిన రహదారులపై ‘ఈ-కార్టు’లు: నగర రోడ్లపై ఈ-కార్ట్’ అనే కొత్త రకం వాహనాలను అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రిక్షాల్లో నలుగురు వ్యక్తులు, 40 కేజీల లగేజీని అనుమతిస్తుండగా, ఈ-కార్ట్‌లను కేవలం సరుకుల రవాణాకు వాడనున్నారు. ఇందులో 310 కేజీల వరకు బరువైన సరుకులను తరలించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ కేటగిరీ కింద అనుమతించనున్న వాహనాలు ప్రభుత్వ ఆమోదిత సంస్థలు నిర్వహించే భద్రత పరీక్షలకు తట్టుకోవాలని, తగిన ప్రామాణికాలను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వాహనాలు తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించాయని ఢిల్లీ హైకోర్టు నమ్మిన మీదటే రహదారులపైకి వచ్చే అవకాశముంది. అయితే నమూనా పరీక్షల విషయమై రోడ్డు భద్రతా నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ-రిక్షాలపై వచ్చేవారం తుది నోటిఫికేషన్
Published Thu, Oct 2 2014 10:43 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement