ఈ-రిక్షాలపై నేడు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై నిషేధాన్ని విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును సమీక్షించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యంపై మంగళవారం విచారణ జరపడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. న్యాయమూర్తులు బీడీ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్ ధర్మాసనం ఎదుట బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ గురించి న్యాయవాది ఆర్.కె. కపూర్ సోమవారం ప్రస్తావించారు. ఈ ప్రజా ప్రయోజనవ్యాజ్యంపై తక్షణం విచారణ జరపాలన్న కపూర్ విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకరించింది. అయితే ఈ-రిక్షాలను నియంత్రించవలసిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. తగిన నియంత్రణ లేనంత వరకు ఈ-రిక్షాలను అనుమతించలేమని న్యాయమూర్తులు పేర్కొంటూనే తమ ఉత్తర్వును సమీక్షించాలని కోరిన పిటిషన్‌పై విచారణ జరపడానికి అంగీకరించారు.
బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాల నియంత్రణకు సంబంధించి కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యద ర్శులకు లేఖ రాసింది. కాబట్టి వాటిపై నిషేధాన్ని తక్షణం సమీక్షించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం కోరింది. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలనుకుంటోందని, ఆ తరువాత ఈ-రిక్షాల నియంత్రణకు మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేయనుందని పిటిషన్ పేర్కొంది. అంతవరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు లేదా పౌర సంస్థలు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ-రిక్షాలను అనుమతించాలని పిటిషన్ కోరింది. జీవనోపాధి కోసం ఈ-రిక్షాలపై ఆధారపడిన లక్షలాది కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిపై నిషేధం విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తక్షణం సమీక్షించాలని లేదా సవరించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.
నగరంలో ఈ-రిక్షాలపై తక్షణం నిషేధం విధిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 31న ఉత్తర్వు జారీచేసింది. ఈ-రిక్షాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణ జరిపేంతవరకు అంటే ఆగస్టు 14 వరకు ఈ-రిక్షాలను రోడ్లపై తిరగనీయరాదని న్యాయస్థానం ఆదేశించింది. నియంత్రణలేకుండా నగరరోడ్లపై తిరిగే ఈ-రిక్షాలు ట్రాఫిక్ సమస్యగా, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. వాటిని వెంటనే నిలిపివేయడం కోసం చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. ఈ వాహనాల్లో ఎంత బరువు తీసుకెళ్లాలి, ఎంత మంది ప్రయాణికులను కూర్చోబెట్టుకోవాలి అనే వాటిపై నిర్దిష్టమైన ఆదేశాలు లేవని, కనీసం రిజిస్ట్రేషన్, బీమా లేదని న్యాయస్థానం ఆక్షేపించింది.
తగిన నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా నడిచే ఈ-రిక్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వీటి వల్ల ఇది వరకే 29కిపైగా రోడ్డు దుర్ఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని నితిన్ గడ్కరీ గత నెల 17న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించడం తెలిసిందే. ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామానును తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు.
ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల్ కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్‌టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ-రిక్షా పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్ దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు.