న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం ఈ నెల 28వ తేదీవరకు కొనసాగుతుందని గురువారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు ఈ -రిక్షాలను తిప్పుకునేందుకు నిర్వాహకులు అనుమతి కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.ఈ-రిక్షాలపై కేంద్రం ఇచ్చిన మధ్యంతర నిబంధనలకు అనుగుణంగా వాటిని నగరంలో తిప్పుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, ప్రభుత్వం పూర్తిస్థాయి నియమ నిబంధనలు రూపొందిచేంతవరకు ఈ-రిక్షాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే ఈ-రిక్షా నిర్హాహకుల కోసం ప్రభుత్వం ఏమైనా చేయదలిస్తే వారు విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు న్యాయమూర్తుల బెంచ్ సూచించింది. కాగా, ఈ మేరకు కోర్టునుంచి కేంద్రానికి సూచనలు చేయాలని ఏఎస్‌జీ అభ్యర్థించారు. ఈ-రిక్షా డ్రైవర్లు, నిర్హాహకులకు తగిన సాయం చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని, ప్రస్తుతం తగిన సమయం లేనందున కోర్టు జోక్యాన్ని కోరుతున్నామని ఆమె తెలిపారు. అయితే దీనిపై వచ్చే విచారణ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
అంతకుముందు కోర్టులో న్యాయవాదులమధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తాము మరో రెండు నెలల్లో ఈ-రిక్షాలను మోటార్ వెహికల్స్ చట్టం కిందకు తీసుకువస్తూ విధివిధానాలు రూపొందిస్తామని, అంతవరకు వాటిని రోడ్లపై తిరిగేందుకు అనుమతించాలని హైకోర్టును కేంద్రం కోరింది. దీనిపై ఈ-రిక్షాలను నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన షహవాజ్‌ఖాన్ తరఫు న్యాయవాది సుగ్రీవ్ దూబే మాట్లాడుతూ ..రాష్ట్రంలో రెండేళ్లుగా చట్టవిరుద్ధంగా తిరుగుతున్న ఈ-రిక్షాల నిర్హాహకులను కట్టడి చేయలేకపోయిన ప్రభుత్వం రెండు నెలల్లో ఏం కట్టడి చేస్తుందని ప్రశ్నించారు. ఈ వాహనాల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండటమే కాకుండా, ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయన్నారు.
ఈ సందర్భంగా బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు ఆర్‌కే కపూర్ మాట్లాడుతూ.. ఈ -రిక్షాలు పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎంతో సహాయకారిగా ఉంటున్నాయని, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని వాహనాలని పేర్కొన్నారు. అలాగే ఈ- రిక్షాలు చట్టాన్ని ఎన్నడూ అతిక్రమించలేదని వాదించారు. అయితే ప్రస్తుత చట్టాల ప్రకారం ఈ-రిక్షాల నిర్వహణకు అవకాశం లేనందువల్లే కోర్టును మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నట్లు ఏఎస్‌జీ తెలిపారు. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఆగస్టు 28వ తేదీవరకు ఈ-రిక్షాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఈ-రిక్షాలపై 28 వరకు నిషేధం కొనసాగింపు
Published Thu, Aug 21 2014 10:24 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM
Advertisement
Advertisement