న్యూఢిల్లీ: మూడుచక్రాల స్కూటర్ రిక్షాలుగా ఈ-రిక్షాలను తిప్పుకునేందుకు అనుమతి ఇస్తే ఇక కోర్టులు నిషేధం విధించడమెందుకు? కోర్టులో న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడమెందుకు? అని హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 1 వరకు ఈ-రిక్షాలను మూడు చక్రాల స్కూటర్ రిక్షాలుగా నగరంలో తిప్పుకునేందుకు అనుమతి ఇచ్చే పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ-రిక్షాల సంఘం తరఫు న్యాయవాది ఆర్‌కే కపూర్ ఈ విషయమై మాట్లాడుతూ... ప్రస్తుతం నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం విధించారని, అప్పటిలోగా మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని, అయితే సెప్టెంబర్ 1 వరకు ఈ-రిక్షాలను మూడు చక్రాల స్కూటర్ రిక్షాలుగా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరిన సందర్భంగా ధర్మాసనం పైవిధంగా స్పందించింది.
ఒకవేళ మీరు కోరినట్లు అనుమతి ఇస్తే ఇక నిషేధం విధించడమెందుకు? అని న్యాయమూర్తులు బదార్ దురేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ-రిక్షాలు ఏ రకమైన వాహనమో తేల్చి చెప్పేందుకు మూడు నెలల సమయముందని కోర్టు తెలిపింది. అందుకే కోర్టు అప్పటి వరకు ఈ-రిక్షాలపై నిషేధం విధించిందని, దానిని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా గత మార్చిలో విడుదల చేసిన మరో ప్రకటన ప్రకారం.. ఈ రిక్షాలను కొనుగోలు చేసినవారు వాణిజ్య వాహనంగా గుర్తింపు పొందుతూ రాష్ట్ర రవాణా విభాగం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
అలా అనుమతులు పొందని వాహనాలపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రభుత్వాలు జారీ చేసిన ప్రకటనలు అమలు అవుతున్నాయా? వాటి అమలు తీరు ఎలా ఉందనే విషయమై కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఈ రిక్షాలకు వాణిజ్య వాహనాలకుగా లెసైన్సులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రస్తుతానికి తాత్కాలిక విధివిధానాలు రూపొందించి, అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో శాశ్వత విధానాలు రూపొందిస్తామన్నారు.
ఇదిలాఉండగా ఈ-రిక్షాలు నగర రహదారులపై తిరగడాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్పొరేషన్లు వీటిపై నిషేధం విధించాయి. హైస్పీడ్ రహదారులపై కాకుండా చిన్న చిన్న గల్లీ రోడ్లలో మాత్రమే వీటిని నడుపుకోవాలని కార్పొరేషన్ సూచించింది. వాహనంలో ఎక్కించుకునే ప్రయాణికుల విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టతనివ్వలేదు. ఈ గందరగోళాన్ని సవాలు చేస్తూ ఈ రిక్షాల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఇప్పటిదాకా ఈ-రిక్షాల విషయంలో ఎటువంటి విధివిధానాలు లేనందున వాటిపై నిషేధం కూడా విధించడం కుదరదని, వాటిని మూడు చక్రాల స్కూటర్ రిక్షాలుగా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
మరి ఇక్కడ మేమెందుకు?
Published Wed, Aug 20 2014 10:30 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM
Advertisement
Advertisement