ఈ రిక్షాలు దోచేస్తున్నాయ్ | E-rickshaws stealing power worth Rs 216cr annually: Discoms | Sakshi
Sakshi News home page

ఈ రిక్షాలు దోచేస్తున్నాయ్

Published Thu, Aug 7 2014 10:59 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఈ రిక్షాలు దోచేస్తున్నాయ్ - Sakshi

ఈ రిక్షాలు దోచేస్తున్నాయ్

 న్యూఢిల్లీ: గడిచిన రెండేళ్లలో ఈ-రిక్షాలు సుమారు రూ.430 కోట్ల విలువైన విద్యుత్‌ను దొంగిలించాయని డిస్కంలు ఆరోపిస్తున్నాయి. నిషేధం విధించక ముందు నగరంలో కొన్ని వేల ఈ రిక్షాలు కార్యకలాపాలు నిర్వహించేవి. కాగా వీటిని ఎక్కడ రీచార్జి చేస్తుండేవారనే విషయంపై ఎవరూ అంతగా దృష్టిపెట్టలేదు. అయితే చాలావరకు ఈ రిక్షాల యజమానులు వీధి దీపాలు, విద్యుత్ లైన్లకు కొంకీలు వేసి దొంగతనంగా రీచార్జి చేస్తున్నారని డిస్కంలు ఆరోపిస్తున్నాయి. ఆయా ఈ రిక్షాలకు ఎక్కడ నుంచి రీచార్జి చేస్తున్నారనే విషయమై ఎటువంటి తనిఖీలు లేకపోవడంతో విచ్చలవిడిగా విద్యుత్ చోరీ కి గురయ్యేదని డిస్కం యాజమాన్యాలు విమర్శించాయి. జూలై 31 న హైకోర్టు నిషేధం విధించినంతవరకు నగరంలో సుమారు లక్ష ఈ రిక్షాలు సంచరించేవి.
 
 ఒక్కో రిక్షాకు రోజుకు సుమారు 10 యూనిట్ల విద్యుత్ అవసరమయ్యేది. పది కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్ విద్యుత్ అవసరమవుతుంది. చాలావరకు ఈ రిక్షాలు రోజూ కనీసం 80 కిలోమీటర్ల వరకు తిరుగుతుండేవి. ఈ లెక్కన నెలకు రూ.18 కోట్ల చొప్పున ఏడాదికి రూ.216 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను ఈ రిక్షాలు అక్రమంగా వాడుకునేవని డిస్కం అధికారులు లెక్క తేల్చారు. ఒకసారి ఈ రిక్షాను రీచార్జి చేస్తే 8 గంటల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఈ సమయం ఆ రిక్షా సుమారు 80 కిలోమీటర్ల పాటు తిరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. ‘ఈ రిక్షాలను రీచార్జి చేయడానికి ఒక విద్యుత్ మాఫియా నగరంలో నడుస్తోంది. వారందరూ విద్యుత్ స్తంభాలు, ఎలక్ట్రిక్ లైన్ల వద్ద ఎప్పుడూ తిరుగాడుతుంటారు. ఈ రిక్షాలు అక్కడికి చేరగానే వాటికి తాము అప్పటికే ఏర్పాటుచేసిన అక్రమ లైన్లతో రీచార్జి చేస్తారు.
 
 అలాగే అనధికార కాలనీల్లో వెలసిన ఇళ్ల వద్ద కూడా అక్రమంగా కనెక్షన్లు ఏర్పాటుచేసి ఈ రిక్షాలకు రీచార్జి చేస్తున్నారు. వీటికి వాళ్లు రోజుకు రూ.50 వరకు వసూలు చేస్తారు..’ అని ఒక డిస్కం అధికారి తెలిపారు. కొంత కాలం కిందట విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న ఈ రిక్షాలపై కేశవ్‌పురం, సివిల్ లైన్స్, రఘుబీర్‌నగర్, మాదిపూర్, తూర్పు సాగర్‌పూర్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.. రఘుబీర్‌నగర్‌లో పీ, ఎన్ బ్లాక్‌లలో విద్యుత్ చోరీ మరీ అధికంగా జరిగేది. అక్కడ ఒక్కో విద్యుత్ పోల్ నుంచి ఒకేసారి 20 వరకు ఈ రిక్షాలకు రీచార్జి చేస్తుండేవారు. కొన్ని వందల ఈ రిక్షాలు అక్కడ లైన్లలో కనిస్తుండేవి..’ అని ఆయన వివరించారు.
 
 కాగా, ఈ రిక్షాల విద్యుత్ అక్రమ వినియోగంపై నిఘా పెట్టడం చాలా కష్టమని డిస్కం అధికారులు అంటున్నారు. ‘చాలా ఈ రిక్షాలను ఇళ్లవద్దే చార్జింగ్ చేస్తుంటారని వారు చెబుతున్నారు. ‘ఈ రిక్షాలనేవి కొత్తగా వచ్చాయి. వాటికి విద్యుత్ వినియోగంపై ఇప్పటివరకు ఎటువంటి  నిబంధనలను మేం రూపొందించలేదు. త్వరలో రూపొందించే టారిఫ్ ఆర్డర్‌లో ఈ రిక్షాలకు సంబంధించి నియమనిబంధనలను రూపొందించబోతున్నాం. వాటిని డిస్కంలు అనుమతించిన పోర్టల్స్ నుంచే చార్జింగ్‌కు అనుమతించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సాధారణంగా ఈ రిక్షాలకు వాణిజ్యపరమైన ధరలను తీసుకోనున్నాం. అయితే వాటిని ఇళ్లవద్దే చార్జింగ్ పెట్టుకుండటంతో గృహ వినియోగ చార్జీలు మాత్రమే చెల్లిస్తున్నారు..’ అని ఢిల్లీకి చెందిన టాటా పవర్ అధికారులు తెలిపారు.
 
 ఇదిలా ఉండగా, ఆటోమొబైల్ దుకాణాలకు ఇప్పుడు ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఈ రిక్షా డ్రైవర్లకు పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వారికి పార్కింగ్‌తోపాటు చార్జింగ్ నిమిత్తం రూ.100 -150 లను కొందరు ఆటోమొబైల్ దుకాణదారులు వసూలు చేస్తున్నారు. ‘ఒక్కో వాహనానికి నాలుగు బ్యాటరీలుంటాయి. ఒక్కో బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేయాలంటే 12 వోల్ట్‌ల విద్యుత్ అవసరమవుతుంది. దీనికి సుమారు 8 గంటల సమయం పడుతుంది...’ అని దుకాణదారులు చెబుతున్నారు.
 
 మోటారు వాహనాల చట్టం కిందకు ఈ రిక్షాలు
 సాక్షి, న్యూఢిల్లీ: ఈ రిక్షాలపై నిషేధాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ కొనసాగించనుంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ రిక్షాల నియంత్రణకు రూపొందించిన మార్గదర్శకాలను న్యాయస్థానం ముందుంచనుంది. ఈ రిక్షాల నియంత్రణ కోసం మోటారు వాహనాల చట్టం కింద వాటి కోసం ప్రత్యేక నిబంధన రూపొందిం చినట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం ఈ రిక్షాలకు రిజిస్ట్రేషన్, లెసైన్స్ అవసరమవుతాయి. అయితే వాటిని పొందే ప్రక్రియ సులభంగా ఉంటుంది. వాహన భద్రతా అంశాలను, ఈ రిక్షా చోదకుల జీవనోపాధి సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రవాణా శాఖ అధికారులు ఈ నిబంధన రూపొందించినట్లు చెబుతున్నారు.
 
 వీటి వేగం గంటకు 25 కి.మీ.మించరాదని,  నలుగురి కన్నా ఎక్కువ మందిని  కూర్చోబెట్టరాదని, 50 కిలోల కన్నా ఎక్కువ లగేజీని అనుమతించరాదని కూడా అధికారులు నిర్ణయించినట్లు  తెలిసింది. నగరంలో ఎన్ని ఈ రిక్షాలను అనుమతించాలి.. వాటిని ఏయే రూట్లలో అనుమతించాలనే అంశాలను అధికారులు పౌరసంస్థలకే వదిలివేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ రిక్షాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రిక్షా డ్రైవర్లు గురువారం జంతర్‌మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. నియంత్రణ లేకుండా రోడ్లపై తిరుగుతోన్న ఈ రిక్షాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని, నియంత్రణలు రూపొందించేంతవరకు వాటిని అనుమతించడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement