మార్గదర్శకాల తర్వాతే మనుగడ | Can't Allow E-rickshaws Without Guidelines: HC | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాల తర్వాతే మనుగడ

Published Tue, Aug 5 2014 10:32 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

మార్గదర్శకాల తర్వాతే మనుగడ - Sakshi

మార్గదర్శకాల తర్వాతే మనుగడ

 సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఈ రిక్షాలపై గతంలో విధించిన నిషేధాన్ని తొలగించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ రిక్షాలపై నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రిక్షాలపై నిషేధం విధిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు బి.డి. అహ్మద్, సిద్ధార్థ్ మదుల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ రిక్షాల నియంత్రణకు సరైన మార్గదర్శకాలు లేకుండా వాటి ని నగరరోడ్లపై అనుమతించబోనని న్యాయస్థానం తెలిపింది. తాను ఈ రిక్షాలకు వ్యతిరేకం కానని అయితే వాటిపై నియంత్రణ అవసరమని అభిప్రాయపడిన న్యాయస్థానం ఈ రిక్షాల నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు ప్రకటించింది.
 
 ఎలాంటి సమస్య లేకుండా ఈ రిక్షాలు రోడ్లపై తిరగడం కోసం ప్రస్తుత ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందని, రెండు రోజుల్లో నిబంధనల ముసాయిదాను న్యాయస్థానం ఎదుట ఉంచుతామని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ న్యాయస్థానానికి తెలిపారు. దానికి అంగీకరించిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై ఆగస్టు 8న తిరిగి విచారణ జరుపుతామని పేర్కొంటూ ఈ రిక్షాలపై నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను తన ముందుంచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, నగరంలో ఈ-రిక్షాలపై తక్షణం నిషేధం విధిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 31న ఉత్తర్వు జారీచేసింది. ఈ-రిక్షాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణ జరిపేంతవరకు అంటే ఆగస్టు 14 వరకు ఈ-రిక్షాలను  రోడ్లపై తిరగనీయరాదని న్యాయస్థానం ఆదేశించింది.
 
 నియంత్రణలేకుండా నగరరోడ్లపై తిరిగే ఈ-రిక్షాలు ట్రాఫిక్ సమస్యగా, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. వాటిని వెంటనే నిలిపివేయడం కోసం చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. ఈ వాహనాల్లో ఎంత బరువు తీసుకెళ్లాలి, ఎంత మంది ప్రయాణికులను కూర్చోబెట్టుకోవాలి అనే వాటిపై నిర్దిష్టమైన ఆదేశాలు లేవని, కనీసం రిజిస్ట్రేషన్, బీమా లేదని న్యాయస్థానం ఆక్షేపించింది. తగిన నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా నడిచే ఈ-రిక్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వీటి వల్ల ఇది వరకే 29కిపైగా రోడ్డు దుర్ఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు విన్నవించారు.
 
 ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని  నితిన్ గడ్కరీ గత నెల 17న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించడం తెలిసిందే. ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామానును తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు.
 
 ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల్ కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్‌టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ-రిక్షా పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్ దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement