ఆప్ నిర్ణయాలు యథాతథం
ఆప్ నిర్ణయాలు యథాతథం
కొనసాగించనున్న ఎల్‌జీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ చార్జీలను 25 శాతం తగ్గించడం, అవినీతి నిరోధక హెల్ప్‌లైన్,ఉచిత నీటి సరఫరా తదితర కీలక నిర్ణయాలు కొనసాగనున్నాయి. వీటిని కొనసాగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన ప్రధాన విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. 49 రోజుల పాలనలో ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తాజా పరిస్థితులను ఈ సందర్భంగా వారు ఆయన ముందుంచారు. ఆప్ సర్కారు తీసుకున్న అనేక కీలక నిర్ణయాలకు సంబంధించి తదుపరి కార్యాచరణను అధికారులతో చర్చించిన ఎల్‌జీ...వాటిని ఇకపై కూడా కొనసాగించాలని నిర్ణయించారు.
నెలకు 400 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ కేజ్రీవాల్ సర్కారు అందించిన సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించారు. అవినీతి నిర్మూలన కోసం ఆప్ సర్కారు 1031 నం బరుతో ప్రారంభించిన హెల్ప్‌లెన్‌ను కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ హెల్ప్‌లైన్‌లో పని చేస్తున్న వారిలో అనేకమంది ఆప్ కార్యకర్తలే. పాలనాధికారం తనకు రావడంతో వారి స్థానంలో ప్రభుత్వోద్యోగులను నియమించాలని ఎల్‌జీ నిర్ణయించారు. ఉచిత నీటిసరఫరాకు సంబంధించి కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన అమలు చేయనున్నారు.
కేజ్రీవాల్ రాజీనామాతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గద్దె దిగడంతో సచివాలయంలో ఒక్కసారిగా వాతావ రణం మారిపోయింది. అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కేజ్రీవాల్, ఆయన మంత్రులు సంప్రదాయానికి విరుద్ధంగా, ఊహించని రీతిలో ప్రవర్తించేవారని, దానితో అన్ని శ్రేణుల ఉద్యోగులలో అయోమయంలో కొట్టుమిట్టాడేవారని వారంటున్నారు. కేజ్రీవాల్‌కు, ఆయన మంత్రులకు తమ కింద పనిచేసే ఉద్యోగులపై నమ్మకం ఉండేది కాదని వారంటున్నారు.
బడ్జెట్ కేటాయింపులు జరపకుండా వాగ్దానాలు ఇవ్వడం వల్ల ప్రజలు తమను తిప్పలుపెట్టే ప్రమాదం ఉందంటూ తాము కేజ్రీవాల్‌ను, ఆయన మంత్రులను హెచ్చరించామని వారు అంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లులో ఉద్యోగులకు ప్రతిపాదించిన శిక్షలు తమకే కాకుండా తమ కుటుంబీకులకు భయం పుట్టించాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి అధికారి చెప్పారు. ఎవరు వల పన్నుతారోననే భయం తమను వేధించేదన్నారు. అందువల్ల తమను ఢిల్లీనుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాల్సిందిగా పలువురు ఉన్నతాధికారులు హోం మంత్రిత్వశాఖను కూడా ఆశ్రయించారని ఆయన చెప్పారు.